హైదరాబాద్: న్యూజిలాండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న రెండో టీ20తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన హైదరాబాద్ యువ పేసర్ మహమ్మద్ సిరాజ్‌కు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మద్దతుగా నిలిచాడు. రాజ్‌కోట్ వేదికగా జరిగిన రెండో టీ20లో సిరాజ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన సంగతి తెలిసిందే.
సిరాజ్ తన పొరపాట్ల నుంచి నేర్చుకుంటాడని బుమ్రా పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన సిరాజ్ ఒక వికెట్ తీసి మొత్తం 53 పరుగులిచ్చిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం బుమ్రా మాట్లాడుతూ 'ఫర్వాలేదు. ఇది సిరాజ్‌కు తొలి మ్యాచ్. బౌలింగ్‌కు పెద్దగా అనుకూలించని ఒక కష్టసాధ్యమైన వికెట్ పై బౌలింగ్ చేయడం అంత సులభం కాదు' అని బుమ్రా అన్నాడు.

అతడు కొత్త జట్టులోకి వచ్చాడు. సిరాజ్ నుంచి అప్పుడే అత్యున్నత స్థాయి ప్రదర్శన ఆశించకూడదు. బౌలర్‌గా అతడు జట్టులో నిలదొక్కుకోవడానికి సమయం ఇవ్వాలి. ప్రస్తుతం సిరాజ్ నేర్చుకునే దశలోనే ఉన్నాడు. తన పొరపాట్ల నుంచి తప్పకుండా నేర్చుకుంటాడు. మన బౌలింగ్‌లో బ్యాట్స్‌మెన్ షాట్లు కొడుతుంటే దాన్నుంచి మనం చాలా నేర్చుకుంటాం' అని బుమ్రా పేర్కొన్నాడు.
'ఈ అనుభవంతో తర్వాతి మ్యాచ్‌లో అతడు కుదురుకుంటాడని నాకు అనిపిస్తోంది. మేం సిరాజ్‌లో ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రయత్నిస్తున్నాం. సిరాజ్‌కు మంచి భవిష్యత్తు ఉందనే అనుకుంటున్నా' అని బుమ్రా అన్నాడు.