గల్లీ నుంచి జాతీయ జట్టులోకి: సెలక్టర్ల పిలుపుపై మహమ్మద్ సిరాజ్
హైదరాబాద్: భవిష్యత్తులో ఏదో ఒకరోజు టీమిండియాకు ఆడతానని అనుకున్నా, కానీ ఇంత త్వరగా పిలుపొస్తుందని ఊహించలేదని న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరిస్‌కు ఎంపికైన హైదరాబాదీ కుర్రాడు మహమ్మద్ సిరాజ్ తెలిపాడు. నవంబర్ 1 నుంచి కివీస్‌తో జరగనున్న టీ20 సిరిస్‌కు సోమవారం జట్టును బీసీసీఐ ప్రకటించింది.
మొత్తం 16 మంది సభ్యులతో కూడిన జట్టును సెలక్టర్లు ప్రకటించారు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడి ఆకట్టుకున్న హైదరాబాద్ కుర్రాడు మహమ్మద్ సిరాజ్, ముంబై ఆటగాడు శ్రేయస్ అయ్యర్ తొలిసారిగా భారత జట్టులో స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే.
దీంతో అతి సామాన్యమైన గల్లీ క్రికెటర్‌గా తన క్రికెట్ కెరీర్‌ని ఆరంభించిన సిరాజ్ భారత క్రికెట్ జట్టులోకి వెళ్లాడు. 1971లో గోవింద రాజ్ తర్వాత జాతీయ జట్టులోకి ఎంపికైన మరో హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్‌గా 23 ఏళ్ల సిరాజ్ ఇప్పుడు అరుదైన ఘనత సాధించాడు.

నా కల నిజమైంది
ఈ సందర్భంగా మహమ్మద్ సిరాజ్ మీడియాతో మాట్లాడుతూ 'భారత జట్టులో చోటు దక్కించుకోవాలన్న నా కల నిజమైంది. భవిష్యత్తులో ఎప్పుడైనా ఆడతానని నమ్మాను కానీ ఇంత తొందరగా ఎంపికవుతానని అసలు ఏమాత్రం ఊహించలేదు. నేనెంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. ఈ విషయం చెప్పినప్పుడు నా తల్లిదండ్రులు ఉద్వేగంతో ఏమీ మాట్లాడలేకపోయారు' అని సిరాజ్ అన్నాడు.

రంజీ ట్రోఫీ ప్రదర్శన కారణం
'ఈరోజు ఈ స్ధాయిలో ఉండటానికి ఐపీఎల్ కంటే రంజీ ట్రోఫీ ప్రదర్శన కారణం అని అనుకుంటున్నా. రంజీ ట్రోఫీలో ప్రదర్శనతోనే ఈ స్థితికి చేరుకున్నా. గత సీజన్‌లో తీసిన 41 వికెట్లు నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. రంజీలో సత్తాచాటడంతో రెస్టాఫ్ ఇండియాకు ఎంపిక చేశారు. అన్ని రకాలుగా నా ఆటను తీర్చిదిద్దిన భరత్ అరుణ్ సార్‌కు రుణపడి ఉంటాను' అని సిరాజ్ తెలిపాడు.

కోచ్ భరత్ అరుణ్ సార్ సూచనల వల్లే
'భారత జట్టు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ సార్ సూచనలు నాకెంతో పనికొచ్చాయి. గతేడాది భరత్ సార్ హైదరాబాద్ జట్టుతో ఉండడం నాకు చాలా కలిసొచ్చింది. అత్యున్నత స్థాయిలో రాణించాలంటే ఎలా బౌలింగ్ చేయాలన్నదానిపై అతనెంతో విలువైన సూచనలిచ్చారు. అతనిచ్చిన సలహాలు ఐపీఎల్ సందర్భంగా నాకెంతో తోడ్పడ్డాయి' అని సిరాజ్ పేర్కొన్నాడు.

సహజశైలిని మార్చుకోవాల్సిన అవసరం లేదని ద్రవిడ్ అన్నారు
'ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు ఆడినప్పుడు భువనేశ్వర్ భాయ్ ఎంతో ప్రోత్సహించాడు. ఇటీవల ‘ఎ' పర్యటనల్లో నా సహజశైలిని మార్చుకోవాల్సిన అవసరం లేదని కోచ్ ద్రవిడ్ సార్ సూచించారు. ఇప్పటివరకు ఎలా బౌలింగ్ చేశావో ఇక నుంచీ అలాగే బౌలింగ్ వేయమని ద్రవిడ్ సార్ చెప్పడం ఎంతో సంతోషం కలిగించింది' అని సిరాజ్ తెలిపాడు.

అమ్మానాన్నలు ఎంతో కష్టపడ్డారు
'నా కెరీర్ కోసం అమ్మానాన్నలు ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు వాళ్ల కష్టానికి ఫలితం దక్కింది. ఐపీఎల్‌కు ఎంపికైనప్పుడు కొంతమేరకు నా ఆర్థిక కష్టాలు తీరిపోయాయి. ఇప్పుడు జాతీయ జట్టులో చోటు దక్కడంతో నా ఆనందానికి అవధుల్లేవు. ఇప్పుడిప్పుడే కెరీర్‌లో సెటిలవుతున్నా' అని సిరాజ్ అన్నాడు.

సొంతిల్లు కట్టుకుంటున్నా
'నాన్నను ఆటో నడుపొద్దని ఐపీఎల్‌కు ఎంపికైనప్పుడే ఒట్టు వేయించుకున్నా. నాన్న ఆ మాట మీదే నిలబడ్డాడు. అమ్మానాన్నలు ఇకనుంచి ఎలాంటి కష్టాలు పడనీయరాదని నిర్ణయించుకున్నా. ఈ దశలో వాళ్లు హాయిగా ఉండాలనుకుంటున్నాను. ఇన్నాళ్లూ అద్దె ఇంట్లో ఉన్నాం. ఇప్పుడు సొంతిల్లు కట్టుకుంటున్నా' అని చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications