వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా ఓటమితో వంద కోట్ల మంది గుండెలు బద్దలయ్యాయి. లీగ్ దశలో, సెమీస్‌లో భారత్ జోరు చూసిన అందరూ ఈసారి ట్రోఫీ మనదే అని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఫైనల్‌లో భారత బ్యాటింగ్ తడబడటంతో భారీ స్కోరు చేయలేకపోయింది. కేవలం విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మాత్రమే హాఫ్ సెంచరీలతో రాణించారు.
మిగతా బ్యాటర్లలో రోహిత్ శర్మ ఒక్కడే ఫర్వాలేదనిపించాడు. దీంతో భారత జట్టు కేవలం 241 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో ఆసీస్ కూడా కొంత తడబడింది. కానీ ట్రావిస్ హెడ్ సెంచరీతో చెలరేగాడు. అతనికి మంచి సహకారం అందించిన మార్నస్ లబుషేన్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. వీళ్లిద్దర్నీ భారత బౌలర్లు అవుట్ చేయలేకపోయారు.

సెకండ్ ఇన్నింగ్సులో మంచు తీవ్రంగా పడటం భారత బౌలర్లను దెబ్బతీసింది. కేవలం మహమ్మద్ షమీ ఒక్కడే బంతితో కూడా ఫర్వాలేదనిపించాడు. కానీ మిగతా బౌలర్లు పెద్దగా సత్తా చాటలేదు. దానికితోడు ఆసీస్ ముందు ఉన్న లక్ష్యం కూడా పెద్దది కాకపోవడంతో వాళ్లు నిదానంగా ఛేజింగ్ పూర్తి చేశారు. అయితే ఈ విజయం తర్వాత ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ చేసిన పని పెద్ద దుమారం రేపింది.
ఇన్ని జట్లు పోటీ పడిన వరల్డ్ కప్ ట్రోఫీని అందుకున్న మార్ష్.. ఆ తర్వాత దానిపై కాళ్లు పెట్టి కూర్చున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది చూసిన చాలా మంది అతన్ని విమర్శించారు. తాజాగా షమీ కూడా ఈ ఫొటోపై స్పందించాడు. 'నాకు చాలా బాధేసింది. ప్రపంచంలోని జట్లు అన్ని పోటీ పడిన ఆ ట్రోఫీని.. తలపైన పెట్టుకోవాలి. అలాంటి దానిపై కాళ్లు పెట్టి కూర్చోవడం నాకేమాత్రం నచ్చలేదు' అని తేల్చి చెప్పాడు.