స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమి తిరిగి టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనం చేయనున్నాడు. వన్డే వరల్డ్ కప్ అనంతరం గాయంతో ఆటకు దూరమైన షమి తాజాగా పూర్తి ఫిటెనెస్ సాధించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతను బోర్డర్ గవాస్కర్ సిరీస్‌కు ముందు రెండు రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు కూడా ఆడే అవకాశం ఉందని సమాచారం.
కర్ణాటక, మధ్యప్రదేశ్‌తో జరిగే రంజీ మ్యాచ్‌ల్లో షమి బరిలోకి దిగనున్నాడని బెంగాల్ టీమ్ మేనేజ్మెంట్ పేర్కొంది. నవంబర్ 6 నుంచి కర్ణాటక, నవంబర్ 13 నుంచి మధ్యప్రదేశ్‌తో బెంగాల్ తలపడనుంది. కేరళతో జరిగే మ్యాచ్‌కు అందుబాటులోకి రాలేదని, కానీ తర్వాత జరిగే రెండు మ్యాచ్‌లకు షమి అందుబాటులోకి వస్తాడని బెంగాల్ జట్టు ప్రధాన కోచ్ లక్ష్మీ రతన్ శుక్లా జాతీయ మీడియాతో పేర్కొన్నాడు.

''టీమిండియాకు షమి ఎంతో విలువైన ఆటగాడు. బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో జట్టు షమి చాలా కీలకం. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు రెండు రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడాలని షమి భావిస్తున్నాడు. ఆసీస్ సిరీస్‌కు ముంగిట ఈ మ్యాచ్‌లు షమికి మేలు చేస్తాయి'' అని శుక్లా అన్నాడు. షమి ఫిటెన్‌స్ గురించి ఇటీవల గందరగోళం ఏర్పడిన విషయం తెలిసిందే.
తన మోకాలికి వాపు వచ్చిందని ప్రచారం చేస్తున్న మీడియాపై షమి మండిపడ్డాడు. అయితే ఆ సంఘటన జరిగిన రెండు వారాల తర్వాత షమి పూర్తిగా కోలేదని రోహిత్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. షమి మోకాలికి వాపు వచ్చిందని, దాంతో చికిత్స తిరిగి ప్రారంభించాల్సి వస్తుందని రోహిత్ అన్నాడు. రిస్క్ తీసుకోమని, ఆస్ట్రేలియా పర్యటనకు షమి దూరమైనట్లే అని రోహిత్ తెలిపాడు.
కాగా, 2023 వన్డే వరల్డ్ కప్ అనంతరం చీలమండల గాయంతో షమి జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. పెయిన్ కిల్లర్స్ వాడుతూ వన్డే ప్రపంచకప్ ఆడిన షమి తర్వాత శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అనంతరం ఎన్సీఏలో పునరాగమనం కోసం ప్రయత్నిస్తున్నాడు. నవంబర్ 22 నుంచి భారత్-ఆస్ట్రేలియా అయిదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. పెర్త్ వేదికగా తొలి టెస్టు నవంబర్ 22-26 వరకు జరగనుంది. అలాగే అడిలైడ్ వేదికగా పింక్ బాల్ టెస్టు డిసెంబర్ 6-10 వరకు, బ్రిస్బేన్ వేదికగా డిసెంబర్ 14-18 వరకు మూడో టెస్టు, డిసెంబర్ 26-30 వరకు బాక్సింగ్ డే టెస్టు, సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి 7 వరకు ఆఖరి టెస్టు జరగనుంది.