
ఎలా ఔట్ చేయాలంటే:
అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌కు కూడా కొన్ని బలహీనతలుంటాయని, వాటిని గుర్తించి బౌలింగ్ చేయాలని మహ్మద్ షమీ అన్నాడు. 'ఇతర ఆటగాళ్లతో ఆడటం ద్వారా ఎన్నో విషయాలు తెలుస్తాయి. అతడి బలాలతో పాటు బలహీనతలు కూడా తెలుసుకోవాలి. బ్యాట్స్‌మన్ సరిగా ఆడలేని జోన్‌లో బౌలింగ్ చేయడంపై బౌలర్ ప్రత్యేక దృష్టి పెట్టాలి. కోహ్లీ అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే అత్యుత్తమ ఆటగాడికి కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి. వాటిని కనిపెట్టి ఔట్ చేయాలి' అని షమీ సూచించాడు. కోహ్లీ బలహీనమైన జోన్‌పై శ్రమిస్తేనే అతడు ఔట్ అవుతాడని చెప్పుకొచ్చాడు.

బౌలర్ల కెప్టెన్:
విరాట్ కోహ్లీ బలహీనతలు స్పష్టంగా తెలియకుండానే ఐపీఎల్‌లో కొన్నిసార్లు ఔట్ చేశానని మహ్మద్ షమీ తెలిపాడు. అయితే కెప్టెన్‌గా కోహ్లీ బౌలర్లకు ఎంతో అండగా నిలుస్తాడని తెలిపాడు. 'కోహ్లీ బౌలర్లకు ఎంతో స్వేచ్ఛనిస్తాడు. మద్దతుగా నిలుస్తూ నమ్ముతాడు. అందుకే ఫలితాలు సానుకూలంగా వస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో అలాంటి కెప్టెన్ ఉండటం బౌలర్లకు ఎంతో ముఖ్యం. దాని వల్ల ఆటలో మరింత రాణించగలం. కోహ్లీ బౌలర్ల కెప్టెన్' అని 29 ఏళ్ల షమీ పేర్కొన్నాడు.

150 కిలోమీటర్ల వేగంతో వేస్తా:
టీమిండియా కెప్టెన్‌ను తానైతే ఎలాంటి బంతులతో బోల్తా కొట్టిస్తానో తాజాగా వివరించాడు పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్. షోయబ్ ఇన్‌స్టాగ్రామ్ లైవ్ వీడియోలో మాట్లాడుతూ... 'నేను కోహ్లీకి బౌలింగ్ చేస్తే.. వికెట్‌కు ఆవలిగా ఎత్తులో బంతులు వేస్తా. అలా వేస్తే కోహ్లీ డ్రైవ్ చేసేందుకు యత్నించి ఔట్ అవుతాడు' అని అక్తర్ చెప్పాడు. 'ఒకవేళ ఆ ఎత్తుగడ ఫలించకుంటే.. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసి కోహ్లీ వికెట్ పడగొడతా' అని అక్తర్ చెప్పుకొచ్చాడు.

ఇప్పటికే 70 సెంచరీలు:
విరాట్ కోహ్లీ భారత్ తరఫున 86 టెస్టులు, 248 వన్డేలు 82 టీ20లు ఆడాడు. 86 టెస్ట్ మ్యాచ్‌ల్లో 57.7 సగటుతో 7240 పరుగులు చేసాడు. ఇందులో 27 సెంచరీలు, 22 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 248 వన్డేల్లో 11867 పరుగులు బాదాడు. ఇందులో 43 సెంచరీలు, 58 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 82 టీ20లో 2794 రన్స్ చేసాడు. పొట్టి ఫార్మాట్లో ఒక్క సెంచరీ లేకున్నా.. 24 హాఫ్ సెంచరీలు బాదాడు.


Click it and Unblock the Notifications












