ధోనీకి చెప్పినా అస్సలు వినలేదు.. గాయంతోనే ప్రపంచకప్ ఆడా: స్టార్ పేసర్

కోల్‌కతా: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో జరిగిన 2015 ప్రపంచకప్‌లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీ అద్భుత ప్రదర్శన చేసాడు. మెగా టోర్నీలో ఉమేష్ యాదవ్ (18) తర్వాత అత్యధిక వికెట్లు (17) తీసిన భారత బౌలర్ షమీనే. ఇక టోర్నిలో నాలుగవ స్థానంలో ఉన్నాడు. 2015 ప్రపంచకప్‌లో 7 మ్యాచ్‌లాడిన షమీ.. 17.29 సగటుతో 17 వికెట్లు పడగొట్టాడు. అయితే టోర్నీ ఆసాంతం మోకాలి గాయంతోనే ఆడినట్లు తాజాగా వెల్లడించాడు. చివరి మ్యాచ్‌కి ముందు తాను బౌలింగ్ చేయలేనని అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోనీ చెప్పినా.. జట్టు కోసం నన్ను తప్పక ఆడించారు అని చెప్పాడు.

మూడు పెయిన్ కిల్లర్ వేసుకున్నా:
మహమ్మారి కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్న మొహమ్మద్ షమీ ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఇర్ఫాన్ పఠాన్‌తో మాట్లాడుతూ పలు విషయాలు అభిమానులతో పంచుకున్నాడు. '2015 వన్డే ప్రపంచకప్ సమయంలో నా మోకాలికి గాయమైంది. మొదటి మ్యాచ్ ముగిసిన తర్వాత గాయం కారణంగా నా మోకాలు వాపు వచ్చింది. దీంతో మోకాలు, తొడ ఒకే పరిమాణంలో కనిపించాయి. కానీ టోర్నీలో జట్టుకి నా అవసరం ఉండటంతో.. వరుస మ్యాచ్‌ల్లో ఆడించారు. ప్రతి మ్యాచ్‌కి ముందు మూడు పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సి వచ్చింది. నితిన్ పటేల్ కారణంగానే టోర్నీ ఆడా' అని షమీ తెలిపాడు.

మ్యాచ్ ఆడలేనని ధోనీకి చెప్పా:
'ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్‌కి ముందు మోకాలి నొప్పి ఎక్కువైంది. ఇదే విషయం నా సహచరులకు చెప్పాను. మ్యాచ్ రోజున మేనేజ్‌మెంట్‌తో చర్చించా. మ్యాచ్ ఆడలేనని కెప్టెన్ ధోనీకి చెప్పేశాను. ఈ రోజు సెమీఫైనల్ మ్యాచ్. ఆస్ట్రేలియా జట్టుతో మ్యాచ్ కావడంతో కొత్త బౌలర్‌తో మేము బౌలింగ్ చేయించలేమని ధోనీ, టీమిండియా మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మ్యాచ్ ఆడాను' అని స్టార్ పేసర్ పేర్కొన్నాడు.

మహీ భాయ్ ధైర్యం చెప్పాడు:
'మహీ భాయ్, జట్టు యాజమాన్యం ఇచ్చిన నమ్మకంతో మ్యాచ్ ఆడా. మొదటి 5 ఓవర్లు బౌలింగ్ చేసి 13 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసా. అరోన్ ఫించ్ వికెట్ కూడా పడగొట్టాను. నొప్పి ఎక్కువవడంతో మహీకి చెప్పి మైదానం వీడా. ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. నేను ఇకపై పరుగెత్తలేనందున బౌలింగ్ చేయలేనని ధోనీకి చెప్పా. నేను నిన్ను నమ్ముతున్నా.. పార్ట్ టైమర్ పరుగులు ఇచ్చే అవకాశం ఉంది, 60 పరుగుల కంటే ఎక్కువ ఇవ్వకుండా చూసుకో అని దైర్యం చెప్పాడు. దీంతో మళ్లీ మైదానంలోకి వచ్చా' అని షమీ చెప్పుకొచ్చాడు.

కెరీర్ ముగిసిపోయిందన్నారు.
'మోకాలి గాయం కారణంగా అప్పట్లో నా కెరీర్ ముగిసిపోయిందని చాలా మంది అభిప్రాయపడ్డారు. కానీ.. మళ్లీ ఫిట్‌నెస్ సాధించి మీ ముందుకు రాగలిగా' అని షమీ చెప్పాడు. సిడ్నీలో జరిగిన సెమీఫైనల్లో మొదటగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 7 వికెట్లకు 328 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ సెంచరీ (105) చేసాడు. అనంతరం భారత్ 233 పరుగులకు ఆలౌట్ అయింది. జేమ్స్ ఫాల్క్‌నర్ (3/59), మిచెల్ స్టార్క్ (2/28), మిచెల్ జాన్సన్ (2/50) అద్భుత ప్రదర్శన చేసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications