
మాంఛెస్టర్: వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు ఓ అలవాటు ఉంది. వికెట్ పడినా, మ్యాచ్ గెలిచినా.. తమ ఆనందాన్ని విభిన్నంగా వ్యక్తం చేస్తుంటారు ఈ కరేబియన్ క్రికెటర్లు. ఇదివరకు గంగ్నమ్ డాన్స్ కూడా విండీస్ క్రికెటర్ల ద్వారానే బాగా పాపులర్ అయింది. ప్రస్తుత ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్‌లో కూడా విండీస్ ఆటగాళ్లు ఓ సరికొత్త ట్రేడ్ మార్క్‌ను పరిచయం చేశారు.
వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ షెల్డాన్ కోట్రెల్ ఇంట్రడ్యూస్ చేసిన ట్రేడ్‌మార్క్ అది. వికెట్ పడిన వెంటనే కోట్రెల్.. దక్షిణాఫ్రికా స్పిన్ బౌలర్ ఇమ్రాన్ తాహిర్ లాగా అథ్లెటిక్ అవతారం ఎత్తి గ్రౌండ్ మొత్తాన్ని చుట్టేసొచ్చేయడు. బౌలర్ ఎండ్ నుంచి మార్చ్‌పాస్ట్ చేసుకుంటూ వస్తాడు. ఓ నాలుగైదు అడుగులు వేసిన తరువాత సెల్యూట్ చేస్తూ, స్టిఫ్‌గా నిలబడి పోతాడు. అది అతని స్టైల్.
దీన్నే అనుసరించాడు టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ. మాంఛెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో ఆఫ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ఎల్‌బీడబ్ల్యూ రూపంలో చివరి వికెట్ తీసిన వెంటనే షమీ విండీస్ బౌలర్ రూపంలో ఆనందాన్ని వ్యక్తం చేశాడు. కోట్రెల్ తరహాలో మార్చ్‌పాస్ట్ చేశాడు. సెల్యూట్ చేయాలని అనిపించలేదేమో, అలా చెయ్యి పైకెత్తి కిందికి దించేశాడు. కోట్రెల్‌ను అనుసరిస్తూ నెటిజన్ల కంట్లో పడ్డాడు. ఇంకేముంది? అతనిపై మెమెలు రెడీ అయిపోయాయి.