మరికొన్ని రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకూ జట్లను ప్రకటించనప్పటికీ, టీమ్ లోకి ఎవరిని తీసుకుంటారు, ఎవరిని పక్కనపెడతారనే విషయాలపై క్రికెట్ అభిమానుల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో కీలక ప్లేయర్స్ ను పక్కన పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం సాగుతోంది. ఇంతకీ వారెవరంటే?
కోహ్లీ, రోహిత్ కు లాస్ట్ ఛాన్స్
ఫిబ్రవరి 19 ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం కానుంది. అయితే బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో పేలవ ప్రదర్శనతో సిరీస్ కోల్పోవడం, డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరే అవకాశాలు గల్లంతవ్వడంతో, ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా ఎలా ఆడుతందనే ఆసక్తి అందరిలో నెలకొంది. పైగా సీనియర్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆటతీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. వారిని పక్కనపెట్టాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. అయినా కూడా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో చివరి అవకాశం కల్పిస్తారని తెలిసింది.

అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కన్నా ముందు టీమ్ ఇండియా, స్వదేశంలో ఇంగ్లాండ్ తో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది. ఈ సిరీస్ కు కూడా ఇంకా జట్టును ప్రకటించలేదు. అయితే ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ ఆడే భారత జట్టే, ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం అందింది.
వారిని పక్కనపెట్టే అవకాశం
ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో కేఎల్ రాహుల్ , రవీంద్ర జడేజా, మహ్మద్ షమీలకు స్థానం దక్కకపోవచ్చని కొత్త ప్రచారం మొదలైంది. మోకాలిలో వాపు కారణంగా ఆస్ట్రేలియా సిరీస్‌కు దూరంగా ఉన్న సీనియర్ పేసర్ మహ్మద్ షమీ తిరిగి జట్టులోకి రావాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. కానీ అతడికి అవకాశం ఇవ్వరని తెలుస్తోంది. వైట్ బాల్ ఫార్మాట్‌లో రవీంద్ర జడేజా బ్యాటింగ్ గతంలోలా లేదు. అందుకే అతడి స్థానంలో వన్డేలకు అక్షర్ పటేల్ కు ఛాన్స్ దక్కవచ్చని పలువురు అంటున్నారు. ఇంకా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో వికెట్ కీపర్ స్థానం కోసం కేఎల్ రాహుల్, పంత్‌ల మధ్య తీవ్ర పోటీ ఉంటుందని తెలిసింది. వీరిలో ఒకరికే అవకాశం దక్కుతుంది.
కాగా, జనవరి 12 లోపు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ మొదలు కానుంది. అంతకుముందు ఇంగ్లాండ్ తో టీమ్‌ఇండియా జనవరి 22 నుంచి ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్ లో తలపడనుంది.