
టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇప్పటికే తొలి టెస్టులో షమీ 8 వికెట్లు తీసి టెస్టు క్రికెట్‌లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో మరో 5 వికెట్లు తీస్తే సౌతాఫ్రికాపై 50 వికెట్లు తీసిన రెండో భారత పేసర్‌గా షమీ అరుదైన ఘనతను చేరుకుంటాడు. మొత్తంగా ఐదో భారత బౌలర్‌గా నిలుస్తాడు. దక్షిణాఫ్రికాపై టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత ఆటగాళ్ల జాబితాలో స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే మొదటి స్థానంలో ఉన్నాడు. అనిల్ కుంబ్లే సఫారీలపై 84 వికెట్లు తీశాడు. ఆ తర్వాత రెండో స్థానంలో భారత పేసర్ శ్రీనాథ్ ఉన్నాడు. శ్రీనాథ్ ఇప్పటివరకు 64 వికెట్లు తీశాడు. మూడో స్థానంలో మరో దిగ్గజ స్పిన్నర్ హర్బజన్ సింగ్ ఉన్నాడు. భజ్జీ 60 వికెట్లు తీశాడు. ఆ తర్వాత నాలుగో స్థానంలో ప్రస్తుత టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ ఉన్నాడు. అశ్విన్ ఖాతాలో సౌతాఫ్రికాపై 56 వికెట్లు ఉన్నాయి. అంతేకాకుండా మహ్మద్ షమీ తన కెరీర్‌లో ఎక్కువ వికెట్లను సౌతాఫ్రికా పైనే తీశాడు. ఇప్పటివరకు ఆ జట్టుపై 45 వికెట్లు తీశాడు. అందులో 3 సార్లు 5 వికెట్ల ప్రదర్శన ఉంది.
కాగా సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో టెస్టు మ్యాచ్ కేప్‌టౌన్ వేదికగా ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ప్రారంభించింది. లంచ్ విరామ సమయానికి 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. క్రీజులో వెటరన్ బ్యాటర్ చటేశ్వర్ పుజారా (26), కెప్టెన్ విరాట్ కోహ్లీ (15) ఉన్నారు. అంతకు ముందు ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ టీమిండియాకు శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు. జట్టు స్కోర్ 31 పరుగుల వద్ద ఉండగా 12 పరుగులు చేసిన రాహుల్ ఒలివర్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే 15 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కాగా సౌతాఫ్రికా గడ్డపై ఇప్పటివరకు ఒక్క సారి కూడా టెస్టు సిరీస్ గెలవని భారత జట్టు ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. ఇప్పటివరకు ముగిసిన రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవడంతో కేప్‌టౌన్ టెస్ట్ ఫలితంతోనే సిరీస్ విజేత తేలనుంది.