హైదరాబాద్: తన భార్య హసిన్ జహాన్‌తో కలిసి దిగిన ఓ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో తీవ్ర విమర్శలకు గురైన టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీ వెనక్కు తగ్గడం లేదు. తాజాగా న్యూ ఇయర్‌ని పురస్కరించుకుని తన భార్యతో కలిసి ఉన్న ఫోటోను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు.
ఫోటో కింద తన భార్యపై తనకు అంతులేని ప్రేమ ఉందని పేర్కొన్నాడు. 'నిన్ను చూసినప్పుడు నాకో అందమైన తోడు దొరికిందని గట్టిగా చెప్పగలను. కొత్త సంవత్సర శుభాకాంక్షలు' అంటూ ట్వీట్ చేశాడు. కాగా, 2017 సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని షమీ ఆకాంక్షించాడు. తన స్నేహితులందరూ సంతృప్తికర జీవితం గడపాలని కోరుకున్నాడు.
కాగా, డిసెంబర్ 23వ తేదీన తన భార్య, కూతురితో కలిసి దిగిన ఫోటోను షమీ ఫేస్‌బుక్‌లో పోస్టు చేయగా తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆ ఫోటోలో హసిన్ జహాన్ స్లీవ్ లెస్ గౌను ధరించి ఉంది. అయితే ఈ ఫోటోలను చూసిన కొంత మంది నెటిజన్లు మతకోణంలో తీవ్రంగా వ్యతిరేకించారు.
'నువ్వు చేసుకున్నది ముస్లింనా? లేక హిందువునా?' అని కూడా ప్రశ్నించారు. కొందరు అతనికి తన మతం గురించి కూడా గుర్తు చేశారు. నీ భార్య ఎందుకు ముసుగు ధరించలేదు అని కూడా ప్రశ్నించారు. అయితే కొందరు ముస్లింలు షమీకి అండగా నిలిచారు. చూడముచ్చటైన కుటుంబమని పేర్కొన్నారు.
ఈ విషయంలో తన భార్య, కూతురికి షమీ అండగా నిలిచాడు. తన భార్య వేసుకున్న దుస్తులు ఇస్లాం మతానికి విరుద్ధమైనవి కావని పేర్కొన్నాడు. సోషల్ మీడియాలో వెల్లువెత్తున కామెంట్లపై మహ్మద్ షమీ కూడా ట్విట్టర్‌లో అభిమానులకు సమాధానమిచ్చాడు.
ఫొటోలోని వారిద్దరూ తన జీవితమని, ఎంతో సంతోషంతో ఉన్న తమను చూసి ఏడ్చేవారికి తానేమీ చెప్పలేనన్నారు. మంచేదో చెడేదో తనకు తెలుసని, మనిషి మంచితనం తెలియాలంటే అంతరంగం చూడాలని అన్నాడు.
మరోవైపు ఈ విషయంలో పలువురు మాజీ క్రికెటర్లు షమీకి మద్దతుగా నిలిచారు. వీరిలో సీనియర్ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ కూడా ఉన్నారు. 'ఇలాంటి వ్యాఖ్యలు చాలా సిగ్గుపడేలా ఉన్నాయి. మహ్మద్ షమీకి నా మద్దతు ఉంటుంది. దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. నేను చెప్పదలచుకున్నది అర్థమయ్యి ఉంటుందని భావిస్తున్నా' అని కైఫ్ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.