న్యూఢిల్లీ: మోకాలి నొప్పి కారణంగా దొరికిన విరామాన్ని టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీ ఆనందంగా గడుపుతున్నాడు. తన కూతురు అయిరా షమీతో ఉల్లాసంగా గడుపుతున్నాడు. అయిరా బౌలింగ్ చేస్తుంటే తాను బ్యాటింగ్ చేశాడు. తల్లి హసీం జహాన్ చిన్నారి కూతురితో బౌలింగ్ వేయిస్తుంటే తండ్రి మహ్మద్ షమీ బ్యాటింగ్ చేస్తూ ఆనందాన్ని జుర్రుకున్నాడు.
తన కూతురు బౌలింగు చేస్తుంటే తాను బ్యాటింగ్ చేస్తున్న వీడియోను అప్‌లోడ్ చేశాడు. న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ సమయంలో అయిరా అస్వస్థతకు గురైంది. రోజూ మ్యాచ్ ముగిసిన తర్వాత ఐసీయూలో ఉన్న కూతురిని చూసేందుకు షమీ వెళ్తూ ఉండేవాడు.
అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు కోలుకుని హాయిగా ఆడుకుంటున్న కూతుర్ని సంతోష పెట్టేందుకు తల్లిదండ్రులు కలిసి ఆడటం ఎంతో ఆకట్టుకుంది. దీన్ని వీడియో చిత్రించిన షమీ తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
అదే సమయంలో ఫిట్నెస్ సాధించి జట్టులోకి రావడానికి షమీ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే చివరి రెండు టెస్టు మ్యాచులకైనా ఎంపిక కావాలనే పట్టుదలతో ఉన్నాడు.