సెయింట్ లూసియా: టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీపై జట్టు పేసర్ మొహమ్మద్ షమీ ప్రశంసల వర్షం కురిపించాడు. అంతేగాక, కోహ్లీ తీసుకున్న నిర్ణయాలకు మద్దతు పలికాడు. గత రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లో ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో టీమిండియా బరిలోకి దిగడం సరైనదేనని అన్నాడు.
రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాన వెస్టిండీస్‌పై విజయం సాధించకపోవడంపై కొందరి నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో షమీ స్పందించాడు. విరాట్ కోహ్లీ అవలంభించే స్పెషలిస్ట్ బౌలర్ల థియరీలో ఎటువంటి తప్పిదం లేదని చెప్పాడు.
ఇలా చేయడం వల్ల బౌలర్ల ప్రతిభ వెలుగులోకి వస్తుందని తెలిపాడు. అంతేగాక, జట్టు బౌలింగ్ విభాగం కూడా మరింత బలపడుతుందని అన్నాడు.

'ఐదుగురు స్పెషలిస్టులో విరాట్ ఫార్ములా సరైనదే. ఒక ఫాస్ట్ బౌలర్ ఎక్కువ సమయం బౌలింగ్ చేసే సమయంలో విశ్రాంతి కూడా అవసరం. ఆ క్రమంలో స్పెషలిస్టు బౌలర్ల థియరీ ఉపయెగపడుతుంది. ఈ విధానంలో బౌలర్లపై అదనపు భారం కూడా తగ్గే అవకాశం ఉంది' అని షమీ పేర్కొన్నాడు.
చాలా కాలం అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉన్న తాను తిరిగి గాడిలో పడటం నిజంగా సంతోషకరమన్నాడు. అయితే పూర్తి ఫిట్ నెస్ తో జట్టులోకి వచ్చిన తరువాత మళ్లీ గాయాల బారిన పడుకూడదని అనుకుంటున్నట్లు షమీ పేర్కొన్నాడు.
మంగళవారం నుంచి ఇరు జట్ల మధ్య మూడో టెస్టు ఆరంభం కానున్న నేపథ్యంలో గ్రాస్ ఐస్ లెట్‌లోని డారెన్ స్యామీ స్టేడియంలో టీమిండియా ప్రాక్టీస్ చేస్తోంది. మొదటి టెస్ట్ ఇన్నింగ్స్ విజయం నమోదు చేసిన టీమిండియా, రెండో టెస్టును విండీస్ ఆటగాడు ఛేజ్ చెలరేగడంతో డ్రాగా ముగించిన విషయం తెలిసిందే.