
దక్షిణాఫ్రికాతో జరగుతున్న సెంచూరియన్ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ 5 వికెట్లు పడగొట్టి కెరీర్‌లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. అయితే తాను ఈ స్థాయికి చేరుకోవడానికి తన తండ్రే కారణమని ఈ సందర్భంగా షమీ చెప్పాడు. తన కెరీర్ కోసం తన తండ్రి ఎంతో శ్రమించినట్టు తెలిపాడు.
తనది ఉత్తరప్రదేశ్‌లోని అల్మోరా జిల్లాలో గల సహస్‌పూర్ అనే ఓ మారుమూల గ్రామం అని చెప్పాడు. క్రికెట్ ప్రాక్టీస్ చేసేందుకు తమ ఊర్లో గ్రౌండ్ ఉండేది కాదని తెలిపాడు. దీంతో వాళ్ల నాన్న సైకిల్‌పై 30 కిలోమీటర్లు ప్రతిరోజూ అతన్ని క్రికెట్ అకాడమీకి తీసుకెళ్లేవాడని భావోద్వేగానికి లోనయ్యాడు.
ఇప్పటికీ తన గ్రామంలో క్రికెట్ ఆడడానికి సరైన సౌకర్యాలు లేవని తెలిపాడు. అలాంటి కష్టమైన పరిస్థితుల్లో కూడా తన తండ్రి తనపై నమ్మకం పెట్టుకున్నాడని, తన కోసం ఎంతో శ్రమించాడని గుర్తు చేసుకున్నాడు. ఇందుకుగాను తాను తన తండ్రికి ఎప్పటికీ రుణపడి ఉంటానని షమీ తెలిపాడు. ప్రస్తుతం తనపై కురుస్తున్న ఈ ప్రశంసలకు తన తండ్రే అర్హుడని చెప్పాడు.
తన కెరీర్ కోసం వాళ్ల నాన్నతోపాటు వాళ్ల సోదరుడు కూడా కష్టపడ్డారని, చాలా ప్రోత్సహించారని షమీ గుర్తు చేసుకున్నాడు. కాగా 2017లో మహ్మద్ షమీ తండ్రి చనిపోయాడు. అలాగే టెస్టు క్రికెట్ అంటే రాకెట్లు సైన్స్ కాదని ఈ సందర్భంగా షమీ చెప్పుకొచ్చాడు. పిచ్ పరిస్థితులను అర్థం చేసుకోని, బంతులు ఎక్కడ వేయాలో అవగాహన ఉండాలని చెప్పాడు. కష్టపడితే ఫలితాలు వాటంతట అవే వస్తాయని షమీ తెలిపాడు.
సెంచూరియన్ వేదికగా జరగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో షమీ సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో 16 ఓవర్లు బౌలింగ్ చేసి 44 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. తద్వారా కెరీర్‌లో 200 వికెట్ల క్లబ్‌లో చేరాడు. అంతేకాకుండా టీమిండియా తరఫున వేగంగా 200 వికెట్లు తీసిన మూడో పేసర్‌గా నిలిచాడు. షమీ 55 టెస్ట్ మ్యాచ్‌ల్లో 200 వికెట్లు తీయగా.. అతని కంటే ముందు కపిల్ దేవ్ 50 టెస్టుల్లో, జవగళ్ శ్రీనాథ్ 54 టెస్టుల్లో 200 వికెట్లు తీశాడు. అంతేకాకుండా టెస్ట్ క్రికెట్‌లో 200 వికెట్లు తీసిన 11వ పేసర్‌గా షమీ నిలిచాడు. కాగా షమీ వన్డేల్లో 148, టీ20ల్లో 18 వికెట్లు తీశాడు.