
టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ తన బౌలింగ్ ప్రదర్శనలతో ఎన్నోసార్లు ఇండియా విజయాల్లో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇక ఆన్ ఫీల్డ్‌లో బుల్లెట్ బంతులతో దూసుకెళ్లే ఈ స్పీడ్ స్టార్.. ఆన్ రోడ్‌లో కూడా స్పీడ్ డ్రైవ్ ఆస్వాదించే రైడర్ కూడా. అతను ఇటీవల జాగ్వార్ ఎఫ్ టైప్ స్పోర్ట్స్ కారును కొనుగోలు చేశాడు. అతను ఈ కారు కొంటున్నప్పుడు తీసిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శుక్రవారం షమీ జాగ్వార్ ఎఫ్ టైప్ స్పోర్ట్స్ కారును కొని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఈ కారు విశేషాలు తెలిస్తే వావ్ అనాల్సిందే. అనేక అధునాతన ఫీచర్లు ఈ కారు సొంతం. జాగ్వార్ ఎఫ్ టైప్ స్పోర్ట్స్ కార్లలో దీనికి ఓ ప్రత్యేకత ఉంది.
ఈ కారు ధర దాదాపు రూ.కోటి (రూ.98.13లక్షలు ఎక్స్-షోరూమ్ ధర). ఈ కారు రెడ్ కలర్లో (కాల్డెరా రెడ్) తలుక్కుమంటుంది. ఇది టూ సీటర్. కేవలం 3.7 సెకన్లలో 0 నుంచి 100కి.మీల వేగాన్ని అందిపుచ్చుకుంటుంది. V8 331కిలోవాట్ల శక్తిమంతమైన ఇంజన్ ఈ కారులో ఉంటుంది. ఇది 2.0-లీటర్ 4లీటర్ సిలిండర్ టర్బోఛార్జ్ పెట్రోల్ ఇంజిన్. ఎనిమిది గేర్లతో కూడిన స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఇందులో ఉంటుంది. అత్యధిక వేగం 250కి.మీ. ఇది రోడ్డుపై సజావుగా రైడ్ చేయడానికి కావాల్సిన సదుపాయాన్ని ఇస్తుంది.
న్యూఢిల్లీలోని ప్రముఖ లక్సరీ కార్ల షోరూం అయిన శివ మోటార్స్‌లో షమీ ఈ కారు కొన్నాడు. శివ మోటార్స్ డైరెక్టర్ అమిత్ గార్గ్ షమీకి కారు అప్పజెప్పుతున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక షమీ సైతం అమిత్ గార్గ్‌కు తాను సైన్ చేసిన క్రికెట్ బంతిని బహుమతిగా ఇచ్చాడు. ఇక షమీ ఇలాంటి లక్సరీ కార్లను కొనడం ఇదే మొదటి సారి కాదు. అతని గ్యారేజీలో ఇప్పటికే టయోటా ఫార్చ్యూనర్, బీఎండబ్ల్యూ 5-సిరీస్, ఆడి తదితర కార్లున్నాయి. అలాగే అతను సరికొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ GT 650 బైక్ కూడా కొనుగోలు చేశాడు. షమీ తన కొత్త బైక్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఇక వెస్టిండీస్‌తో జరిగే 3 వన్డే మ్యాచ్‌ల సిరీస్‌కు షమీ విశ్రాంతి తీసుకోగా.. జూలై 29న ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు అతను తిరిగి జట్టులో చేరుతాడు.