
వచ్చే నెలలో ఇంగ్లాండ్‌తో జరగనున్న రీషెడ్యూల్డ్ 5వ టెస్టు కోసం బీసీసీఐ సెలెక్ట్ చేసిన జట్టులో చటేశ్వర్ పుజారా తిరిగి భారత టెస్టు జట్టులోకి వచ్చాడు. టెస్టు క్రికెట్‌లో ఫామ్ కోల్పోవడంతో పుజారాను శ్రీలంకతో స్వదేశంలో జరిగిన సిరీస్‌కు సెలెక్షన్ కమిటీ ఎంపిక చేయలేదు. పుజారా గత రెండేళ్లుగా సరైన ఫామ్‌లో లేడు. జనవరి 2019నుంచి అతను ఒక్క టెస్ట్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఇక దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ భారత్ ఓడిపోయిన తర్వాత అతన్ని సెలెక్టర్లు జట్టు నుంచి తప్పించారు.
ఇక పుజారా కౌంటీ ఛాంపియన్‌షిప్లో ఆడేందుకు ఇంగ్లాండ్‌కు వెళ్లాడు. కౌంటీల్లో ససెక్స్ తరఫున ఆడిన పుజారా అద్భుతంగా రాణించాడు. అతను సెంచరీల మీద సెంచరీలు చేయడంతో సెలెక్టర్లు అతన్ని ఎంపిక చేయక తప్పలేదు. దీంతో ఇంగ్లాండ్‌తో జరగబోయే 5వ టెస్టుకు తిరిగి అతను జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. కౌంటీకి వెళ్లి అద్భుతంగా రాణించి జాతీయ జట్టు తలుపు తట్టిన పుజారా సంకల్పం, నైపుణ్యాలను భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ప్రశంసించాడు. యువ క్రికెటర్లకు పుజారా గొప్ప ప్రేరణ అని పేర్కొన్నాడు.
'మీరు (యువ క్రికెటర్లు) పుజారా నుండి చాలా నేర్చుకోవచ్చు. మీరు ఒకవేళ జట్టులో నుంచి డ్రాప్ అయితే.. మీరు బ్యాటర్‌గా ఏమి చేయాలి? మీరు తిరిగి కౌంటీ ఛాంపియన్ షిప్‌కో లేక రంజీ టోర్నీకో వెళ్లి అద్భుతంగా రాణించాలి. టన్నుల కొద్దీ రన్స్ చేయాలి. పుజరా అదే చేశాడు. తొలగించబడిన ఏ యువ ఆటగాడికైనా అతను ఒక ఉదాహరణ. తిరిగి జట్టులోకి ఎలా పునరాగమనం చేయాలో అతనో దారి చూపించాడు.
అతను భారత జట్టు తరఫున తుది ప్లేయింగ్ 11లో ఆడతాడని నేను భావిస్తున్నాను' అని కైఫ్ పేర్కొన్నాడు. పుజారా చాలా ఏళ్లుగా భారతదేశం ప్రీమియర్ టెస్ట్ బ్యాటర్లలో ఒకడు. అతను 95టెస్టు మ్యాచ్‌ల్లో 43.87 సగటుతో 6,713 పరుగులు చేశాడు. అలాగే 18సెంచరీలు, 32 అర్ధసెంచరీలు కూడా సాధించాడు.