
న్యూజిల్యాండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో భారత బౌలర్లు చెలరేగారు. ఆరంభంలో పిచ్ నుంచి బౌలర్లకు అందుతున్న మూవ్‌మెంట్‌ను చక్కగా ఉపయోగించుకొని పరుగులు కట్టడి చేశారు. అర్షదీప్ సింగ్ మరోసారి తన తొలి ఓవర్లోనే ఫిన్ అలెన్ (3)ను పెవిలియన్ చేర్చాడు. అయితే మరో ఓపెనర్ డెవాన్ కాన్వే (59) మరో ఎండ్‌లో నిలకడగా ఆడుతూ, ఎక్కువ రిస్కులు తీసుకోకుండా ఇన్నింగ్స్ నిర్మించాడు. అయితే అర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో కాన్వే కూడా పెవిలియన్ చేరాడు.
కేన్ విలియమ్సన్ స్థానంలో జట్టులోకి వచ్చిన మార్క్ చాప్‌మాన్ (12) పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే గ్లెన్ ఫిలిప్స్ (54) మరోసారి చెలరేగాడు. వీళ్లిద్దర్నీ పేసర్ మహమ్మద్ సిరాజ్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కివీస్ ఇన్నింగ్స్ ఎక్కువ సేపు సాగలేదు. సిరాజ్‌కు జతకలిసి అర్సదీప్ సింగ్ కూడా చెలరేగాడు. ఒకే ఓవర్లో డారియల్ మిచెల్ (10), ఐష్ సోధి(0)ను పెవిలియన్ చేర్చాడు. అదే ఓవర్‌లో సిరాజ్ వేసిన సూపర్ త్రోకు ఆడమ్ మిల్నే కూడా పెవిలియన్ చేరాడు.
సిరాజ్ కూడా ఒకే ఓవర్లో జేమ్స్ నీషమ్ (0), శాంట్నర్ (1) ఇద్దరినీ పెవిలియన్ చేర్చాడు. ఫిలిప్స్ తర్వాత వచ్చిన ఒక్క కివీ బ్యాటర్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. పేకమేడలా న్యూజిల్యాండ్ ఇన్నింగ్స్ కూలిపోయింది. ఇక చివరి ఓవర్లో టిస్ సౌథీ (4)ని హర్షల్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేయడంతో కివీస్ ఇన్నింగ్స్ ముగిసింది. మొత్తమ్మీద న్యూజిల్యాండ్ జట్టు 19.4 ఓవర్లలో 160 పరుగులకు చాప చుట్టేసింది. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్ ఇద్దరూ చెరో నాలుగు వికెట్లతో చెలరేగారు. హర్షల్ పటేల్ ఒక వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేయడం గమనార్హం.