
తొలి టెస్టులో ఏడు వికెట్లు
ఇండోర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో షమీ మొత్తం ఏడు వికెట్లతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసిన షమీ, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లతో చెలరేగాడు. . దీంతో సోమవారం ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో షమీ ఎనిమిది స్థానాలు ఎగబాకి ఏడో స్థానంలో నిలిచాడు.

790 రేటింగ్ పాయింట్లతో టాప్-10లో షమీ
షమీ సాధించిన 790 రేటింగ్ పాయింట్లు ఓ భారత పేసర్‌కు మూడో అత్యుత్తమం కావడం విశేషం. అంతకముందు కపిల్ దేవ్(877), జస్ప్రీత్ బుమ్రా(832) రేటింగ్ పాయింట్లతో షమీ కంటే ముందున్నారు. ఈ నేపథ్యంలో చారిత్రాత్మక డే/నైట్ టెస్టులో మహ్మద్ షమిపై భారీ అంచనాలే ఉన్నాయి.

ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై అందరి ఆసక్తి
ఇదిలా ఉంటే, డే/నైట్ టెస్టు మ్యాచ్ జరుగబోతున్న ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై అందరి ఆసక్తి నెలకొంది. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పింక్ బాల్ ఎలా స్పందిస్తుందోనని ఇప్పుడే ఓ అంచనాకు రాలేకపోతున్నారు. అయితే పిచ్‌పై పచ్చిక ఉండే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. రాత్రిపూట కురిసే మంచును దృష్టిలో పెట్టుకుని పిచ్‌ను రూపొందిస్తున్నట్లు సమాచారం.

పిచ్‌పై పచ్చిక ఉంటే పేసర్లకు అనుకూలం
పచ్చికను ఏ స్థాయిలో ఉంచాలి.. ఎంత మొత్తం నీటితో తడపాలనే దానిపై క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) క్యూరేటర్ ముఖర్జీ అతని బృందం పలుమార్లు చర్చించింది. మొత్తంగా పిచ్‌పై పచ్చిక ఉంటే భారత పేస్ త్రయం షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్‌లకు ఇక తిరుగుండదు.