PSL 2026: పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL 2026) 2026లో మహమ్మద్ రిజ్వాన్ సారథ్యంలోని రావల్పిండి జట్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆడిన 4 మ్యాచ్‌ల్లోనూ వరుస ఓటములతో కుప్పకూలిన ఈ జట్టు.. ఇప్పుడు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఈ క్లిష్ట సమయంలో జట్టులో ఉత్సాహం నింపేందుకు కెప్టెన్ రిజ్వాన్ చేసిన ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మహమ్మద్ రిజ్వాన్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఇచ్చిన మోటివేషనల్ స్పీచ్ విదేశీ ప్లేయర్లను గందరగోళానికి గురిచేయడమే ఇందుకు ప్రధాన కారణం.
భాష అర్థంకాక విదేశీయుల అవస్థలు
రావల్పిండి ఫ్రాంచైజీ అధికారికంగా విడుదల చేసిన ఓ వీడియోలో.. రిజ్వాన్ తన జట్టు సభ్యులందరినీ కూర్చోబెట్టి ఉర్దూలో సుదీర్ఘమైన స్పీచ్ ఇస్తూ కనిపించాడు. అయితే జట్టులోని అంతర్జాతీయ ఆటగాళ్లకు ఉర్దూ రాకపోవడంతో.. రిజ్వాన్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక వారు బ్లాంక్ ఫేస్‌లతో చూస్తూ అలా ఉండిపోయారు. ఈ నేపథ్యంలో "విదేశీ ఆటగాళ్ల ముఖాలు చూడండి.. అర్థం కాని భాషలో ఇచ్చే మోటివేషన్‌ను వారు బలవంతంగా వినాల్సి వస్తోంది" అంటూ నెటిజన్లు రిజ్వాన్‌ను భారీగా ట్రోల్ చేస్తున్నారు. కేవలం విదేశీయులే కాదు.. పాక్ ప్లేయర్లు కూడా రిజ్వాన్ పదే పదే చెప్పే మాటలకు బోర్ ఫీలవుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

నాయకత్వంపై విమర్శలు
అంతర్జాతీయ లీగ్‌లలో వివిధ దేశాల ఆటగాళ్లు ఉంటారు కాబట్టి సాధారణంగా కెప్టెన్లు ఇంగ్లీష్‌ను కమ్యూనికేషన్ భాషగా ఎంచుకుంటారు. కానీ మహమ్మద్ రిజ్వాన్ ఉర్దూలోనే మాట్లాడటం అతని నాయకత్వ పటిమపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. సగం మందికి అర్థం కాని మాటలు స్ఫూర్తిని ఎలా నింపుతాయని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు రిజ్వాన్ తన ప్రసంగంలో "అల్లా మనకు అన్ని మ్యాచ్‌ల్లో విజయాన్ని ప్రసాదిస్తాడు" అని చెప్పడం కూడా చర్చకు దారితీసింది. కేవలం దైవంపై భారం వేస్తే సరిపోదని.. వ్యూహాలు కూడా ఉండాలని విమర్శకులు మండిపడుతున్నారు.
డ్రెస్సింగ్ రూమ్‌లో విభేదాలు?
వరుస పరాజయాలతో ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న జట్టులో ఇప్పుడీ భాషా సమస్య కమ్యూనికేషన్ గ్యాప్‌ను పెంచుతోంది. కెప్టెన్ చెప్పే సందేశం ఆటగాళ్లందరికీ ఒకేలా చేరకపోతే స్టేడియంలో సమన్వయం దెబ్బతింటుంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రిజ్వాన్ జట్టు రెండు వర్గాలుగా (లోకల్, ఫారినర్స్) విడిపోయినట్లు కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టోర్నీలో నిలవాలంటే రావల్పిండి జట్టు తక్షణమే ఈ లోపాలను సరిదిద్దుకోవాల్సి ఉంది.