IND vs PAK:దుబాయ్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్ ను ఓడించింది. ఈ నేపథ్యంలో భారత్ విజయోత్సవాలు జరుపుకుంటుంటే.. పాకిస్థాన్ లో ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. భారత్ చేతిలో పాకిస్థాన్ ఘోర పరాజయం తర్వాత పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా స్పందించాడు. పాకిస్థాన్ జట్టులో అనుభవరాహిత్యం స్పష్టంగా కనిపిస్తోందని కనేరియా మండిపడ్డాడు.
బాబర్ ఆజంను కోహ్లీతో పోల్చారు.. కానీ బాబర్ ఆజం చిన్న జట్లపై మాత్రమే పరుగులు చేస్తాడని.. బాబర్ మరో సారి బిగ్ మ్యాచ్ లో విఫలమయ్యాడని విమర్శలు గుప్పించాడు. అదే సమయంలో విరాట్ కోహ్లీ తనను బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని ఎందుకు పిలుస్తారో చూపించాడని చెప్పాడు. విరాట్ అద్భుతమైన సెంచరీని సాధించి.. పాకిస్థాన్ పై జట్టును సులభంగా విజయం వైపు నడిపించాడని డానిష్ కనేరియా ప్రశంసలు కురిపించాడు.

పాకిస్థాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ప్రశ్నలు సంధించాడు. మహ్మద్ రిజ్వాన్ కంటే ముందు షాహీన్ అఫ్రిదిని కెప్టెన్ గా నియమించారని.. బాబర్ ఆజం ప్రపంచ కప్ లో కెప్టెన్ గా ఉన్నాడన్నారు. సర్ఫరాజ్ తర్వాత పాకిస్థాన్ జట్టును ముందుకు తీసుకెళ్లగల ఆటగాడు ప్రస్తుతం లేడని తాను నమ్ముతున్నానన్నాడు. ఏ బౌలర్ ను ఏ సమయంలో ఎంచుకోవాలో రిజ్వాన్ కు తెలియదన్నారు. రిజ్వాన్ కు దుబాయ్ పిచ్ గురించి తెలుసన్నారు.
టాస్ గెలిచిన తర్వాత తాను ముందుగా బౌలింగ్ చేసి లక్ష్యాన్ని ఛేదించగలిగేవాడినని డానిష్ కనేరియా చెప్పాడు. కానీ కెప్టెన్ రిజ్వాన్ కు తన బౌలింగ్ పై నమ్మకం లేదన్నాడు. భారత్ 350 పరుగుల భారీ స్కోరు చేస్తే పాకిస్థాన్ ఆ పరుగులను ఎలా ఛేదిస్తుందని రిజ్వాన్ భయపడ్డాడని కనేరియా చెప్పుకొచ్చాడు. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ కేవలం 241 పరుగులకు ఆలౌట్ కాగా.. పాకిస్థాన్ బౌలర్లపై భారత్ బాగా ఆడి గెలిచిందన్నాడు. ఒక్క పాకిస్థానీ బౌలర్ కూడా భారత బ్యాటర్లపై ఒత్తిడి పెంచలేకపోయాడని డానిష్ కనేరియా మండిపడ్డాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ లను పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ప్రశంసించారు. వారిద్దరి నాయకత్వలో టీమిండియా చాలా బాగా రాణిస్తోందని డానిష్ కనేరియా అన్నాడు. పాకిస్థాన్ జట్టు మేనేజ్ మెంట్ పై డానిష్ కనేరియా మాటల దాడి చేశారు. పీసీబీ రాజకీయాలపై కాకుండా క్రికెట్ పై దృష్టి పెట్టాలని డానిష్ కనేరియా పేర్కొన్నాడు.