పాకిస్థాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌ను టీమిండియా సీనియర్ బ్యాట్సమన్ శిఖర్ ధావన్ దారుణంగా ట్రోల్ చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను పాక్ 1-4తో కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే మూడో టీ20లో రిజ్వాన్ చేసిన ఓ పని నెట్టింట్లో వైరల్‌గా మారింది. మైదానంలో రిజ్వాన్ ఎప్పటికీ తెలివిగా ప్రవర్తించలేడని నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
ఓవల్ వేదికగా జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్ మొదట 7 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. అయితే భారీ లక్ష్య ఛేదనకు ఓపెనర్‌గా రిజ్వాన్ బరిలోకి దిగాడు. దూకుడుగా ఆడటానికి ప్రయత్నిస్తూ స్కోరుబోర్డు ముందుకు నడిపించాడు. మ్యాట్ హెన్రీ వేసిన ఆరో ఓవర్లో మిడ్ వికెట్‌గా రిజ్వాన్ షాట్‌కు యత్నించాడు. కానీ బ్యాట్ స్లిప్ అయ్యి చేజారింది. దీంతో బ్యాటును అక్కడే వదిలేసి రన్స్ కోసం రిజ్వాన్ ట్రై చేశాడు.

అయితే రిజ్వాన్ క్రీజును దాటడానికి కాలును ఉపయోగించకుండా, కబడ్డీ ప్లేయర్‌లా గీతను తాకడానికి కష్టపడ్డాడు. అయితే ఆ పని కూడా రిజ్వాన్ సరిగా చేయలేదు. క్రీజుకి ఇవతలే చేతిని తాకించి రెండో పరుగుకు ప్రయత్నించాడు. దీంతో అంపైర్లు షార్ట్ రన్‌గా పరిగణించి ఒక్క పరుగే ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోను ధావన్ ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. కబడ్డీ కబడ్డీ అంటూ వ్యంగ్యంగా క్యాప్షన్ రాసుకొచ్చాడు.
మరోవైపు నెటిజన్లు కూడా రిజ్వాన్‌ను ఆడుకుంటున్నారు. తీవ్రంగా కష్టపడి శరీరాన్ని వంచకుండా, మరో అడుగు ఎక్సట్రా పరిగెడితే సరిపోయేది కదా అంటూ సలహాలు ఇస్తూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, రిజ్వాన్ తరుచూ నెటింట్లో వైరల్‌గా ఉంటాడు. ప్రదర్శనతోనే కాకుండా అందరి దృష్టిలో పడాలని అతడు చూసే పనులు భిన్నంగా ఉంటాయి.
మైదానంలో కొన్నిసార్లు నటిస్తానని రిజ్వానే స్వయంగా పేర్కొనడం విశేషం. ప్రపంచకప్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రిజ్వాన్ తిమ్మిర్లతో ఇబ్బంది పడ్డాడు. అయితే కాస్త అతిగా బాధ పడినట్లుగా క్రీజులో ప్రవర్తించాడు. ఈ విషయంపై మ్యాచ్ అనంతరం అతడిని వ్యాఖ్యాతలు ప్రశ్నించారు. దీంతో కొంచెం నొప్పి, కొంచెం యాక్టింగ్ అని రిజ్వానే స్వయంగా చెప్పాడు. కాగా, న్యూజిలాండ్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్‌గా రిజ్వాన్ నిలిచాడు. అయిదు ఇన్నింగ్స్‌ల్లో 46 సగటుతో 184 పరుగులు చేశాడు.