హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తండ్రి అయ్యాడు. ఆయన భార్య పూజా ఏప్రిల్ 4న పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో అతడికి ట్విట్టర్లో అభినందనలు వెల్లువలా వస్తున్నాయి. భారత మాజీ క్రికెటర్లు సచిన్, సెహ్వాగ్, టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లే సహా పలువురు క్రికెటర్లు, అభిమానులు కైఫ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
తనకు పాప పుట్టిన విషయాన్ని కైఫ్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. అందమైన, చక్కటి ఆరోగ్యంతో ఉన్న పాపకు పూజ జన్మినిచ్చిందని కైఫ్ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. గతేడాది తండ్రి అయిన హర్భజన్ సింగ్ వెల్‌కమ్ టూ క్లబ్ అంటూ కైఫ్‌కు అభినందనలు తెలిపాడు.
కాగా, నోయిడాకు చెందిన జర్నలిస్ట్ అయిన పూజాను 2011లో కైఫ్ పెళ్లాడాడు. వీరికి ఇప్పటికే కబీర్ అనే ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. కైఫ్ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో గుజరాత్ లయన్స్ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా పని చేస్తున్న సంగతి తెలిసిందే.
17 సంవత్సరాల క్రితం బెంగళూరులో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా కైఫ్ భారత క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. రెండేళ్ల తర్వాత కాన్పూర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే ద్వారా పరిమిత ఓవర్ల క్రికెట్లోకి అడుగుపెట్టాడు. భారత్ తరుపున 125 వన్డేలు ఆడిన కైఫ్ 2573 పరుగులు చేశాడు.
2000 సంవత్సరంలో అండర్ 19 వరల్డ్ కప్ నెగ్గిన టీమిండియాకు కైఫ్ కెప్టెన్‌గా ఉన్నాడు. 2002లో ఇంగ్లాండ్‌తో జరిగిన నాట్ వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో యువరాజ్‌తో కలిసి అద్భుతమైన బ్యాటింగ్ అభిమానులకు ఇప్పటికే గుర్తే.