
హైదరాబాద్: టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్ మొహ్మద్ కైఫ్ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. ఇప్పటికే పలుమార్లు తను చేసిన ట్వీట్లకు వివాదాలు ఎదుర్కొన్నా.. మళ్లీ అంతటి పనే చేశాడు. తాజాగా మరోసారి ట్విట్టర్ ద్వారా పాకిస్థాన్ టీమ్‌కు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ చేశాడు. దానిని గమనించిన నెటిజన్లు అతనిపై ట్వీట్ల దుమారం లేపారు. జింబాబ్వేలో జరిగిన టీ20 ట్రై సిరీస్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై ఆరు వికెట్లతో గెలిచి ట్రోఫీ ఎగరేసుకుపోయింది పాకిస్థాన్.
ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఓపెనర్ ఫకర్ జమాన్ 91 పరుగులు చేశాడని. దీంతో పాక్ టీమ్‌ను, ఫకర్ జమాన్‌ను పొగుడుతూ కైఫ్ ఓ ట్వీట్ చేశాడు. ఈ విషయం భారత క్రికెట్ అభిమానులకు, కైఫ్ అభిమానులకు అస్సలు రుచించలేదు. పాక్ టీమ్‌ను పొగుడుతావా అంటూ కైఫ్‌తో ఆడుకోవడం మొదలుపెట్టారు. దేశ ద్రోహి అని ఒకరు.. పాకిస్థాన్‌పై అంత ప్రేమ ఎందుకు.. పాకిస్థాన్ గెలిస్తే నీకూ ఆనందం ఉప్పొంగుతుందా.. అని మరొకరు.. ఇలా కైఫ్‌ను ట్రోల్ చేస్తున్నారు.
ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్‌కు దిగి 20 ఓవర్లలో 8 వికెట్లకు 183 పరుగులు చేసింది. ఓపెనర్ షార్ట్ 76 పరుగులు చేశాడు. తర్వాత చేజింగ్ మొదలుపెట్టిన పాకిస్థాన్.. 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేజ్ చేసింది. జమాన్ కేవలం 46 బంతుల్లో 91 పరుగులు చేశాడు. ఈ ముక్కోణపు సిరీస్‌లో జింబాబ్వే కూడా ఆడింది. ఈ మ్యాచ్‌ను గెలవడంతో.. పాకిస్థాన్ మొత్తం సిరీస్ విజేతగా నిలిచింది.
కైఫ్ నెటిజన్ల ఆగ్రహానికి గురవ్వడం ఇది తొలిసారేం కాదు. గతంలో క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటూ.. యోగా చేస్తూ సూర్యనమస్కారాలు పెట్టడం, కొడుకుతో చెస్ ఆడుతున్న ఫొటోలతో విమర్శలకు గురైయ్యాడు. వీటన్నిటికి స్ట్రాంగానే రిప్లే ఇచ్చిన కైఫ్ తాజా కామెంట్లకు ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.