T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్-8లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలవ్వడమే కాకుండా.. టీమ్ ఎంపికపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను పక్కనపెట్టి వాషింగ్టన్ సుందర్‌ను తీసుకోవడంపై టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గంభీర్ తీసుకున్న ఈ నిర్ణయం ఆందోళనలో తీసుకున్నదని కైఫ్ పేర్కొన్నాడు.
అక్షర్ పటేల్ ఏం అన్యాయం చేశాడు?
దక్షిణాఫ్రికా జట్టులో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఎక్కువగా ఉన్నారని.. వారిని అడ్డుకోవడానికి ఆఫ్‌స్పిన్నర్ అయిన వాషింగ్టన్ సుందర్‌ను తీసుకున్నామని జట్టు యాజమాన్యం సమర్థించుకుంది. దీనిపై స్పందించిన కైఫ్.. "2024 వరల్డ్ కప్ గెలిచినప్పుడు మన జట్టులో ఏ ఆఫ్‌స్పిన్నర్ ఉన్నాడు? అశ్విన్ లేడు, సుందర్ లేడు. అప్పుడు లెఫ్ట్ హ్యాండర్లను మనం ఎలా అవుట్ చేశాం?" అని ప్రశ్నించారు. అక్షర్ పటేల్ ఐసీసీ టోర్నీల్లో నిరూపితమైన ఛాంపియన్ అని, అతడిని పక్కన పెట్టడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందని మండిపడ్డారు.

ధోనీ, రోహిత్ దారిలో నడవండి..
మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ వంటి గొప్ప కెప్టెన్లు ఎప్పుడూ అన్ని విభాగాల్లో సమతూకంగా ఉండే జట్టునే ఎంపిక చేసేవారని మహ్మద్ కైఫ్ గుర్తు చేశారు. "ఎదుటి జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉన్నారని మన ప్రధాన స్పిన్నర్‌ను పక్కన పెట్టడం అవివేకం. ఇది మీ సన్నద్ధత లోపాన్ని సూచిస్తుంది. గతేడాది ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో అక్షర్ పటేల్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. అప్పుడు మొయిన్ అలీ వంటి లెఫ్ట్ హ్యాండర్‌ను కూడా అతను ఔట్ చేశాడు. గతాన్ని ఇంత త్వరగా ఎలా మర్చిపోతారు?" అని కైఫ్ ప్రశ్నించారు.
విరాట్ కోహ్లీ కంటే మెరుగ్గా ఆడినా..
2024 వరల్డ్ కప్ ఫైనల్‌లో అక్షర్ పటేల్ ప్రాధాన్యతను కైఫ్ గుర్తు చేశారు. "ఫైనల్లో విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ 128 కాగా, అక్షర్ 150 స్ట్రైక్ రేట్‌తో ఆడి నాలుగు సిక్సర్లు బాదాడు. సెమీఫైనల్, ఫైనల్ గెలవడానికి కారణమైన ఆటగాడిని ఇలాంటి కీలక మ్యాచ్‌లో పక్కన పెట్టడం ఆశ్చర్యంగా ఉంది. దక్షిణాఫ్రికా జట్టు తమ సహజ సిద్ధమైన ఆట ఆడుతుంటే.. టీమిండియా మాత్రం భయంతో మార్పులు చేసింది" అని కైఫ్ విమర్శించారు.
అహ్మదాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 76 పరుగుల తేడాతో ఓడిపోయింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 188 పరుగుల ఛేదనలో భారత్ కేవలం 111 పరుగులకే కుప్పకూలింది. అక్షర్ స్థానంలో వచ్చిన సుందర్ బౌలింగ్‌లో వికెట్లు తీయలేకపోవడమే కాకుండా బ్యాటింగ్‌లోనూ నిరాశపరిచాడు. ఈ ఓటమి తర్వాత జింబాబ్వేతో జరగబోయే తదుపరి మ్యాచ్‌లోనైనా అక్షర్ పటేల్‌ను తిరిగి జట్టులోకి తీసుకుంటారో లేదో చూడాలి.