
రాహుల్ పార్ట్‌టైమ్ కీపరే:
బుధవారం ఓ ఇంటర్వ్యూలో మహ్మద్ కైఫ్ మాట్లాడుతూ... 'భవిష్యత్తులో రాహుల్ టీమిండియా ప్రధాన కీపర్‌గా ఉంటాడని ప్రజలు భావిస్తున్నారు. నా ఉద్దేశంలో మాత్రం రాహుల్ బ్యాకప్ వికెట్ కీపర్ మాత్రమే. రెగ్యులర్ కీపర్ గాయపడ్డప్పుడో లేదా వేరే కారణాల వల్ల అతడు అందుబాటులో లేనప్పుడు మాత్రమే రాహుల్‌తో కీపింగ్ చేయించాలి. లేకపోతే అతడిపై పనిభారం ఎక్కువయ్యే ప్రమాదముంది. ఇదే సమయంలో గాయాలు అయ్యే అవకాశాలు పెరుగుతాయి' అని అన్నాడు.

మహీ కీపర్‌గా ఉండాలి:
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందన్న కైఫ్.. పొట్టి ప్రపంచకప్‌లో మహీ కీపర్‌గా ఉండటమే జట్టుకు మంచిదన్నాడు. ఐపీఎల్ ఫామ్‌ను బట్టి ధోనీని అంచనా వేయడం సరికాదు. అతడు గొప్ప బ్యాట్స్‌మన్. ప్రస్తుతం చాలా ఫిట్‌గా ఉన్నాడు. అందుకే ఐపీఎల్ ఆడాలనుకుంటున్నాడు, కెప్టెన్సీ చేయాలనుకుంటున్నాడు. అందుబాటులోనే ఉన్నానని చెప్పాలనుకుంటున్నాడు. మానసికంగా ధోనీ విజయం సాధిస్తూనే ఉన్నాడు. అలాగే ఒత్తిడిలో మ్యాచ్‌ను ఎలా గెలిపించాలో కూడా అతడికి తెలుసు' అని కైఫ్ చెప్పాడు.

బీసీసీఐది నిర్ణయం:
కరోనా వైరస్ కారణంగా ఏర్పడ్డ కఠిన పరిస్థితిలో క్రీడల కంటే జీవితం చాలా ముఖ్యమైంది కాబట్టి ఐపీఎల్ 2020ని వాయిదా వేయడం సరైన నిర్ణయం అని కైఫ్ అభిప్రాయపడ్డాడు. 'క్రీడల కంటే జీవితం చాలా ముఖ్యమైనది. బీసీసీఐ నిర్ణయం సరైనదని నేను భావిస్తున్నాను. పరిస్థితి మెరుగుపడినప్పుడు క్రీడల గురించి ఆలోచించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా క్రీడా కార్యక్రమాలు వాయిదా లేదా రద్దు చేయబడ్డాయి. మన దేశంలో కేసులు పెరుగుతున్నాయి కాబట్టి ప్రస్తుతానికి పరిస్థితి అదుపులో లేదు. కాబట్టి ఇది సరైన నిర్ణయం. ప్రజల ప్రాణాలే ముఖ్యం' అని అన్నాడు.

కీపర్ రేసులో రాహుల్, పంత్:
ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరులో టీ20 ప్రపంచకప్ జరగనుండగా.. కీపర్ రేసులో లోకేష్ రాహుల్, రిషబ్ పంత్ ముందు వరుసలో ఉన్నారు. ఐపీఎల్ 2020 సీజన్ జరిగి.. ఎంఎస్ ధోనీ ఫామ్ నిరూపించుకోగలిగితే అతడు కూడా ఈ రేసులోకి వచ్చే అవకాశం ఉంది. కానీ.. మహమ్మారి కరోనా వైరస్ కారణంగా మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ నిరవధిక వాయిదా పడింది. ఇప్పటికీ వైరస్ పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో టోర్నీ జరగడంపై సందిగ్ధత నెలకొంది.


Click it and Unblock the Notifications












