టీ20 ప్రపంచకప్ చివరిది.. రిటైర్మెంట్ ప్రకటించిన సీనియర్ క్రికెటర్?!!

కరాచీ: పాకిస్థాన్ సీనియర్ ఆల్‌రౌండర్ మహ్మద్ హఫీజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు త్వరలోనే వీడ్కోలు పలకనున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. అయితే రిటైర్మెంట్ ప్రకటించే ముందు ఆస్ట్రేలియా గడ్డపై ఈ ఏడాది అక్టోబరులో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించాలనుందని 39 ఏళ్ల హఫీజ్ తెలిపాడు. మెగా టోర్నీ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు చెప్పబోతున్నట్లు హఫీస్ స్పష్టం చేశాడు.

ప్రపంచకప్ తర్వాత వీడ్కోలు:
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ తరఫున ఆడటం, అందులో బాగా రాణించడమే తన ప్రధాన లక్ష్యం అని మహ్మద్ హఫీజ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. 'టీ20 ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నా. అయితే టీ20 లీగ్స్‌లో మాత్రం కొనసాగుతా. భవిష్యత్ ఎలా ఉంటుందో? నాకు తెలియదు. కానీ.. కోచ్‌గా అవకాశం వస్తే మాత్రం వదులుకోను' అని హఫీజ్ తెలిపాడు.

పాక్ తరఫున 12,258 పరుగులు:
39 ఏళ్ల మహ్మద్ హఫీజ్ ఇప్పటికే టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. కేవలం వైట్-బాల్ ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నాడు. త్వరలో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లకు కూడా వీడ్కోలు పలకనున్నాడు. పాక్ తరఫున హఫీజ్ 55 టెస్టులు, 218 వన్డేలు, 91 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తంగా 12,258 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్‌లోనూ 246 వికెట్లు పడగొట్టాడు. ఆఫ్ స్పిన్ బౌలింగ్ వేసే హఫీజ్.. జట్టు కష్టాల్లో ఉన్నపుడు కీలక వికెట్లు తీసేవాడు.

పీఎస్ఎల్‌లో రాణించిన హఫీజ్:
ఇటీవల పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో 10 మ్యాచ్‌లాడిన మహ్మద్ హఫీజ్.. 217 పరుగులు చేశాడు. ఇందులో 98 పరుగుల భారీ ఇన్నింగ్స్ కూడా ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించినా.. పీఎస్‌ఎల్ లాంటి ప్రైవేట్ టీ20 లీగ్స్‌లో మాత్రం కొనసాగుతానని హఫీజ్ స్పష్టం చేశాడు. గత ఏడాది ఇంగ్లాండ్‌లో జరిగిన ప్రపంచకప్ తర్వాత జాతీయ సెలెక్టర్లు అతన్ని పక్కనపెట్టారు. ఈఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్ కోసం పాకిస్తాన్ జట్టులో పునరాగమనం చేసాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications