
హైదరాబాద్: పాకిస్థాన్‌లో జరిగిన తాజా ఎన్నికల్లో పాక్ మాజీ క్రికెటర్, రాజకీయనాయకుడు ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పీటీఐ పార్టీ ఈ సారి అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. మెజారిటీకి కొద్ది దూరంలో నిలిన ఇమ్రాన్... మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు.
ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో పీటీఐ 272 స్థానాలకు 115 గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధాని పదవి చేపట్టనున్న తరుణంలో ఇమ్రాన్ ఖాన్‌కు టీమిండియా మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత అజహరుద్దీన్ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం మాట్లాడుతూ "ఓ క్రికెటర్ తన దేశానికి ప్రధానికావడం పట్ల సంతోషంగా ఉంది. మైదానంలో మాదిరిగానే ఇమ్రాన్ ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నా. అయితే ఇమ్రాన్ ముందున్నది పూలబాటకాదనీ, ఆయన పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి" అని అజహరుద్దీన్ అన్నారు.
"పాకిస్తాన్ జట్టు కెప్టెన్‌గా ఉన్నప్పుడు మైదానంలో ఆయన చాలా సానుకూలంగా, ధైర్యంగా, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునేవాడు. ప్రధానిగా బాధ్యతలు చేపడితే... అదే పంథాను ఇప్పుడు కూడా కొనసాగించాలి. క్రికెట్ జట్టును నడిపించడం, దేశాన్ని నడిపించడం ఒకదానికొకటి పూర్తిగా విరుద్ధం, కాబట్టి ముందు ముందు ఎలాంటి ఫలితాలు ఉంటాయో వేచిచూడాలి" అని అజహరుద్దీన్ తెలిపాడు.
ఇమ్రాన్ ఖాన్ ప్రధాని కావడం వల్ల భారత్, పాక్ సంబంధాల్లో సానుకూలత వచ్చే అవకాశాలున్నాయా అన్నప్రశ్నకు గాను ఇరు దేశాల మధ్య వైరం తగ్గాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ''అన్నిటికంటే ముందు ఆయన దేశంలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. తొలుత ఇమ్రాన్ వాటిని పరిష్కరించడంపై దృష్టి పెట్టాలి. ఆ తర్వాతే ఆయన ఇతర సమస్యల వైపు దృష్టిపెట్టగలరు'' అని అజార్ పేర్కొన్నాడు.
1992లో పాక్‌కు వరల్డ్ కప్ అందించిన ఇమ్రాన్ ఖాన్ క్రీడలకు వీడ్కోలు పలికిన తర్వాత తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ స్థాపించారు. రెండు దశాబ్దాల పోరాటం తర్వాత ఆయన పాక్‌కు ప్రధాని కాబోతున్నారు.