
హైదరాబాద్: హెచ్‌సీఏ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ కుమారుడు అసదుద్దీన్, భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా సోదరి ఆనమ్ మిర్జా వివాహనికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే అసదుద్దీన్-ఆనమ్ మిర్జా వివాహా బంధంలో ఒక్కటి కాబోతున్నారు.
అసదుద్దీన్-ఆనమ్ వివాహా రిసెప్షన్ ఈ నెల 12న జరగనుంది. ఈ రిసెప్షన్‌కు హాజరుకావాల్సిందిగా తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. మంగళవారం ప్రగతి భవన్‌లో సీఎంను అజహరుద్దీన్, సానియామిర్జా కలిసారు. అసదుద్దీన్, సానియా వివాహ పత్రిక ఇచ్చి సీఎంను ఆహ్వానించారు. అనంతరం అందరూ కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.
ఇప్పటికే రెండు కుటుంబాలు కలిసి అసదుద్దీన్-ఆనమ్ నిశ్ఛితార్థ వేడుకను ఘనంగా నిర్వహించాయి. వివాహానికి ముందు సానియా సోదరి ఆనమ్ తన స్నేహితులకు ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసింది. ఈ విందులో భాగంగా తన అలంకరణ ఫోటోలను, వీడియోలను ఆనమ్ తన స్నేహితులతో పంచుకుంది. ఆనమ్ తన సోదరి సానియాతో కలసి స్నేహితురాళ్లతో దిగిన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. అప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆనమ్ తన బ్యాచిలర్ పార్టీని పారిస్‌లో ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి అతికొద్ది మంది సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు.
ఆనమ్ మిర్జాకు ఇది రెండో వివాహం. తన మాజీ భర్త అక్బర్ రషీద్ నుంచి ఆనమ్ విడాకులు తీసుకున్నారు. గత కొంత కాలంగా అసద్, ఆనమ్‌లు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ప్రేమను పెద్దల అంగీకారంతో పెళ్లి వరకు అసదుద్దీన్-ఆనమ్‌లు తీసుకెళ్లారు. మరోవైపు అజహరుద్దీన్‌కు ఇద్దరు కుమారులు కాగా.. ఒకరు ఔటర్ రింగ్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే.