

హైదరాబాద్: ఇంగ్లాండ్ జట్టుపై విజయంతో తిరిగొస్తామని మాటిచ్చిన టీమిండియా మాట నిలబెట్టుకోలేకపోయింది. ఇప్పటికే వన్డే సిరీస్‌లో ఓటమిపాలైన టీమిండియా.. రెండ్రోజుల క్రితం జరిగిన నాల్గో టెస్టులోనూ వైఫల్యం చెందడంతో సిరీస్‌ను 1-3 తేడాతో చేజార్చుకుంది. అయితే ఈ పరాజయంపై టీమిండియా సీనియర్ క్రికెటర్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండటంతో వారితో పాటుగా టీమిండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ కూడా తన గళాన్ని వినిపిస్తున్నాడు.
అప్పటికే వైఫల్యాలతో నడుస్తోన్న టీమిండియా గతిని మార్చేసింది మూడో టెస్టు భారీ ఆధిక్యంతో సిరీస్‌పై ఆశలను పురికొల్పింది. మిగిలిన మూడు గెలిస్తే విజయం మనదే.. లేదా ఒక్కటి గెలిచినా డ్రా అయి తీరుతుందని కలలు కన్న భారత క్రికెట్ అభిమానులకు నిరాశే చేతికి చిక్కింది. ఎటు చూసినా జట్టు మొత్తంలో బ్యాట్స్‌మెన్ వైఫల్యానికి కారణంగా కనబడుతోంది. ఈ క్రమంలో కేవలం 60 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోవడం పట్ల అజారుద్దీన్ తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు.
'మనం సిరీస్ ఓడిపోయామంటే అది కేవలం బ్యాట్స్‌మెన్ వైఫల్యమే. కానీ, వారికి సపోర్టింగ్ స్టాఫ్‌గా ఉండాల్సిన బ్యాటింగ్ కోచ్ ఏమైనట్లు' అని ప్రశ్నించారు. మనం ఇంగ్లాండ్ గడ్డపై రాణించలేమనే అపోహను తుడిచి పెట్టాలన్నట్లుగా విరాట్ కోహ్లీ గురించి మాట్లాడారు. విరాట్ కోహ్లీ కేవలం ఈ సిరీస్‌లోనే 544 పరుగులను చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, మూడు హాప్ సెంచరీలు కూడా ఉన్నాయి.
'అసలే ఆల్ రౌండర్ కొరవడిన సమయంలో కేవలం విరాట్ కోహ్లీపైనే ఆధారపడడం కరెక్ట్ కాదు. ఓపెనర్లు ధావన్.. కేఎల్ రాహుల్‌లు ఎంతో కొంత రాణించాల్సి ఉంది. నాలుగో టెస్టులో చతేశ్వర్ పూజారా రాణిస్తే బాగుండేది. ఈ సారి సిరీస్ గెలిచేందుకు ఉన్న మంచి అవకాశాన్ని మనం చేజార్చుకున్నాం. ఎందుకంటే టీమిండియా మంచి బౌలింగ్ బలగంతో ఉంది. ఇలాంటి సమయంలోనే మనం అలా చేయడం సరికాదు.' అని అజారుద్దీన్ చెప్పుకొచ్చాడు.