టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్థాన్ జట్టు వైఫల్యం ఆ దేశ క్రికెట్ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా సూపర్-8 దశలో ఇంగ్లాండ్‌తో జరిగిన కీలక పోరులో ఓటమి పాలవ్వడం.. ఆ జట్టు సెమీఫైనల్ అవకాశాలను దాదాపుగా దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో, పాక్ మాజీ స్టార్ పేసర్ మహమ్మద్ ఆమిర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుత టీ20 కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా భవిష్యత్తుపై మహమ్మద్ ఆమిర్ ఓ భారీ జోస్యం చెప్పాడు.
సల్మాన్ అగా కెప్టెన్సీపై ఆమిర్ ఏమన్నాడంటే?
పాకిస్థాన్‌కు చెందిన ఓ ప్రముఖ స్పోర్ట్స్ టాక్ షోలో పాల్గొన్న మహమ్మద్ ఆమిర్‌కు ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. వరల్డ్ కప్ తర్వాత కూడా సల్మాన్ అలీ ఆఘా కెప్టెన్‌గా కొనసాగుతారా? అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమిర్ ఏమాత్రం తడుముకోకుండా సమాధానమిచ్చారు. ఈ మెగా టోర్నీ ముగియగానే సల్మాన్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడం ఖాయమని ఆయన స్పష్టం చేశాడు. నాయకుడిగా జట్టును ముందుకు నడపడంలోనే కాకుండా, వ్యక్తిగత ప్రదర్శనలో కూడా సల్మాన్ ఘోరంగా విఫలమయ్యారని అమీర్ విశ్లేషించాడు.

గణాంకాలతో సహా విశ్లేషణ
సల్మాన్ అలీ ఆఘా ప్రదర్శనను పరిశీలిస్తే ఆమిర్ విమర్శల్లో వాస్తవం కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆల్ రౌండర్‌గా జట్టులో కీలక పాత్ర పోషించాల్సిన సల్మాన్.. ఈ ప్రపంచకప్‌లో ఆడిన 5 మ్యాచ్‌ల్లో కేవలం 48 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లోనూ కేవలం ఒకే ఒక్క వికెట్ పడగొట్టాడు. ఒక కెప్టెన్ ముందుండి జట్టును నడిపించాల్సింది పోయి, ఇలాంటి పేలవమైన ఫామ్‌తో జట్టుకు భారంగా మారడంపై ఆమిర్ అసహనం వ్యక్తం చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్.. ఈ రెండు విభాగాల్లోనూ ఆయన ప్రభావం చూపలేకపోవడం జట్టు ఓటములకు ప్రధాన కారణమని మహమ్మద్ ఆమిర్ పేర్కొన్నాడు.
ఇంగ్లాండ్‌తో ఉత్కంఠ పోరు.. పాక్ చేజేతులా ఓటమి
ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ చేజార్చుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 164 పరుగులు మాత్రమే చేయగలిగింది. సాహిబ్జాదా ఫర్హాన్ 63 పరుగులతో ఒంటరి పోరాటం చేసినప్పటికీ.. మిగిలిన బ్యాటర్లు ఎవరూ కనీసం 25 పరుగుల మార్కును కూడా దాటలేకపోయారు. ఇంగ్లాండ్ బౌలర్లు లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్‌లు పాక్ బ్యాటింగ్ లైనప్‌ను కట్టడి చేశారు.
హ్యారీ బ్రూక్ వీరవిహారం.. షాహీన్ పోరాటం వృథా
165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు ఆ జట్టు కెప్టెన్ హ్యారీ బ్రూక్ వెన్నుముకగా నిలిచారు. కేవలం 51 బంతుల్లోనే అజేయమైన శతకాన్ని బాది ఇంగ్లాండ్‌ను విజయతీరాలకు చేర్చారు. పాక్ బౌలర్ షాహీన్ అఫ్రిది 4 వికెట్లతో అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ.. ఇతర బౌలర్ల నుంచి ఆశించిన సహకారం అందలేదు. ఫలితంగా 19.1 ఓవర్లలోనే ఇంగ్లాండ్ విజయం సాధించి సెమీస్‌కు దూసుకెళ్లింది. ఈ ఓటమితో పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించడం దాదాపు ఖాయం కావడంతో, ఇక పాక్ క్రికెట్ బోర్డు (PCB) జట్టులో ప్రక్షాళన చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి.