IND vs SA: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ 76 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలవ్వడంపై పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ ఆమిర్ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడు. టీమిండియా పరాజయాన్ని ఆస్వాదిస్తూ మహమ్మద్ ఆమిర్ చేసిన కామెంట్స్, ప్రవర్తించిన తీరు ఇప్పుడు భారత క్రికెట్ అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది.
జ్యోతిష్యుడిగా మారిన ఆమిర్?
పాకిస్థాన్‌లోని ఓ టీవీ టాక్ షోలో పాల్గొన్న మహమ్మద్ ఆమిర్.. టీమిండియాను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నాడు. అంతకు ముందు యువ ఓపెనర్ అభిషేక్ శర్మను 'స్లాగర్' (గుడ్డిగా బ్యాట్ గాలికి ఊపేవాడు) అని విమర్శించిన ఆమిర్.. టీమిండియా సెమీఫైనల్ చేరదని జోస్యం చెప్పాడు. అన్నట్లుగానే సూపర్-8 తొలి మ్యాచ్‌లో భారత్ ఓడిపోయేసరికి.. సదరు షో హోస్ట్ ఆమిర్‌ను 'ఆస్ట్రాలజర్' (జ్యోతిష్యుడు) అని సంబోధించాడు.

వికృత నవ్వులు
హోస్ట్ తనను జ్యోతిష్యుడని పిలవగానే.. మహమ్మద్ ఆమిర్ ఎంతో గర్వంగా, బేషరమ్‌గా నవ్వడం మొదలుపెట్టాడు. తన అంచనా నిజమవుతోందన్న ఆనందం అతని నవ్వులో స్పష్టంగా కనిపించింది. "నన్ను ఏం చేసేశారయ్యా మీరు? అల్లా క్షమించు గాక" అంటూ నవ్వుతూనే భారత్ పరిస్థితిని ఎద్దేవా చేశాడు. భారత జట్టు ఓటమిని చూసి పండగ చేసుకుంటున్న ఆమిర్ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.
సొంత జట్టు సంగతి చూసుకో ఆమిర్!
భారత్‌పై విమర్శలు చేసే ముందు మహమ్మద్ ఆమిర్ తన సొంత జట్టు పాకిస్థాన్ పరిస్థితిని చూసుకోవాలని అభిమానులు చురకలు అంటిస్తున్నారు. అదృష్టం కొద్దీ సూపర్-8కి చేరిన పాకిస్థాన్.. తమ మొదటి మ్యాచ్ వర్షార్పణం అవ్వడంతో సెమీస్ రేసులో వెనుకబడి ఉంది. తమ జట్టు భవిష్యత్తు అంధకారంలో ఉన్నా, భారత్ ఓటమిపై ఆమిర్ ఇలాంటి వెటకారపు నవ్వులు నవ్వడం హాస్యాస్పదమని విశ్లేషకులు అంటున్నారు.
భారత్ సెమీస్ ఆశలు సజీవమే!
దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయినంత మాత్రాన భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించలేదు. జింబాబ్వే, వెస్టిండీస్‌లపై భారీ విజయాలు సాధిస్తే టీమిండియా సెమీఫైనల్‌కు చేరుకుంటుంది. మహమ్మద్ ఆమిర్ చెప్పినట్లు భారత్ టోర్నీ నుంచి అవుట్ అవ్వలేదని, త్వరలోనే మైదానంలో సమాధానం చెబుతామని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.