పాకిస్థాన్ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026లో సెమీ ఫైనల్‌కు చేరుకోకుండానే నిష్క్రమించడంతో ఆ దేశ మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మాజీ పేసర్ మహమ్మద్ ఆమిర్ ప్రస్తుత పాక్ ఆటగాళ్లపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్నాయి. దీనిపై స్పందించిన మహమ్మద్ ఆమిర్, ఒక టీవీ షోలో మాట్లాడుతూ పాక్ జట్టుపై విమర్శల వర్షం కురిపించారు. "నేను నా నిజాయితీతో కూడిన అభిప్రాయాన్ని చెబుతున్నాను. మిగిలిన విషయాలు మర్చిపోండి.. అసలు మన దగ్గర టాలెంట్ (ప్రతిభ) లేదు. ప్రస్తుతం జట్టులో ఆడుతున్న వారిలో ఏ ఒక్కరి దగ్గరా అంతర్జాతీయ స్థాయి టాలెంట్ కనిపించడం లేదు" అని కుండబద్ధలు కొట్టాడు.
బీ-జట్టును పంపి అవమానిస్తున్నారు!
పాకిస్థాన్‌ను ఇతర దేశాలు ఎంత తక్కువగా చూస్తున్నాయో వివరిస్తూ మహమ్మద్ ఆమిర్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. "ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లేదా న్యూజిలాండ్ జట్లు పాకిస్థాన్ పర్యటనకు వచ్చేటప్పుడు తమ 'ఎ' (ప్రధాన) జట్లను పంపడం లేదు. వారు తమ 'బి' లేదా 'సి' జట్లను పంపి సిరీస్ ఆడుతున్నారు. భారత్ వంటి దేశాలకు వెళ్లేటప్పుడు మాత్రం తమ అత్యుత్తమ ఆటగాళ్లను పంపిస్తారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ప్రపంచ దేశాలు మనల్ని ఎంత సీరియస్‌గా తీసుకుంటున్నాయో" అని ఆమిర్ ఆవేదన వ్యక్తం చేశాడు.

మాజీ దిగ్గజాల ఆగ్రహం
కేవలం మహమ్మద్ ఆమిర్ మాత్రమే కాకుండా, ఇతర పాక్ దిగ్గజాలు కూడా బోర్డుపై విరుచుకుపడ్డారు. "ప్రతి రెండేళ్లకోసారి వచ్చే ప్రపంచకప్‌లో దేశ పరువు తీస్తున్నారు. ఇతర జట్లు ఆధునిక క్రికెట్‌కు అలవాటు పడుతుంటే, మన వారు మాత్రం ఇంకా పాత పద్ధతుల్లోనే ఆడుతున్నారు" అని జావేద్ మియాందాద్ విమర్శించారు. "కొంతమంది ఆటగాళ్లకు అనవసరంగా ఎక్కువ అవకాశాలు ఇచ్చారు. వారు ప్రధాన టోర్నీల్లో విఫలమవుతూనే ఉన్నారు. ఇప్పటికైనా తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి" అని మహమ్మద్ యూసుఫ్ హితవు పలికారు. "అగ్రశ్రేణి జట్లను ఓడించే సామర్థ్యం లేనంత వరకు పాకిస్థాన్ ఐసీసీ ట్రోఫీలను గెలవలేదు. కీలక ఆటగాళ్లు ప్రపంచకప్‌లో చేతులెత్తేయడం బాధాకరం" అని మొయిన్ ఖాన్ వాపోయారు.
సర్వత్రా నిరాశ
సల్మాన్ అలీ ఆఘా సారథ్యంలోని పాకిస్థాన్ జట్టు శ్రీలంకపై నామమాత్రపు విజయం సాధించినప్పటికీ.. ఇంగ్లాండ్ వంటి పెద్ద జట్ల ముందు నిలవలేకపోయింది. ఆమిర్ వంటి మాజీల ఘాటు విమర్శల నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) రాబోయే రోజుల్లో ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.