
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర స్థాయి క్రికెట్‌లో ఘోరం జరుగుతుందంటూ ఓ వ్యక్తి చేసిన ఆరోపణను బీసీసీఐ సీరియస్‌గానే తీసుకుంది. రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపిక చేయాలంటే.. అమ్మాయిలను పంపాలని లేదా లంచాలిచ్చుకోవాల్సిన పరిస్థితి దాపరించిందని బాధితుడు చేసిన ఆరోపణకు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మహ్మద్ అక్రం సైఫీపై సస్పెన్షన్ జారీ చేస్తూ బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకుంది.
సీవోఏ చైర్మన్ వినోద్ రాయ్, బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి సీకే ఖన్నా ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఆరోపణలకు సాధ్యమైనంత త్వరగా వివరణ ఇవ్వాలని అక్రంను ఆదేశించారు. విచారణ పూర్తయ్యే వరకు అతను ఎలాంటి పదవుల్లో ఉండకూడదని తెలిపింది. అక్రం వ్యవహారాన్ని విచారించేందుకు 48 గంటల్లో కమిషన్‌ను నియమిస్తామని ఖన్నా వెల్లడించారు.
నివేదిక సమర్పించేందుకు అతను 15 రోజుల వ్యవధి అడిగినట్లు పేర్కొన్నారు. బీసీసీఐ నేర విచారణ విభాగం.. ఆడియో టేపులను న్యూస్ ఛానెల్ నుంచి స్వీకరిస్తామని బోర్డు అవినీతి నిరోధక యూనిట్ చీఫ్ అజిత్ సింగ్ తెలిపారు. ఇందులో ఉన్న ప్రతి ఒక్కర్ని విచారిస్తామన్నారు. మరోవైపు తమపై వచ్చిన ఆరోపణలను యూపీసీఏ కార్యదర్శి యధ్‌వీర్ సింగ్ ఖండించాడు.
రాహుల్ భారత్ జట్టుకు గానీ, రాష్ట్ర జట్టుకుగానీ ప్రాతినిధ్యం వహించలేదని, అలాంటప్పుడు అతను చేసిన ఆరోపణలను ఎలా పరిగణనలోకి తీసుకుంటారని ప్రశ్నించాడు. సంచలనంగా మారిన యూపీసీఏ వ్యవహారంపై ఇంతవరకు రాజీవ్ శుక్లా నోరు మెదపలేదు. ఈ ఉదంతంపై యూపీ క్రికెటర్లు ఆర్పీసింగ్, కైఫ్ విచారం వ్యక్తంచేశారు. మరోవైపు ఆదేశాలకు అనుగుణంగా అక్రమ్ తన అసిస్టెంట్ పదవికి రాజీనామా చేశాడు.