హైదరాబాద్: వరల్డ్ ఎలెవన్‌తో మంగళవారం నుంచి ఆరంభమయ్యే మూడు టీ20ల సిరిస్‌కు పాక్ పేసర్ మొహమ్మద్ అమిర్ దూరం కానున్నాడు. వచ్చే వారం ఆమిర్ భార్య లండన్‌లో బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆమిర్ తన భార్య వద్ద ఉండాలని అనుకుంటున్నాడు.
ఈ నేపథ్యంలో అమిర్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ), కోచ్ ఇంజమాముల్ హక్ నుంచి అనుమతి తీసుకుని లండన్ వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఇదిలా ఉంటే మూడు టీ20ల సిరిస్ కోసం వరల్డ్ ఎలెవన్ జట్టు ఇప్పటికే పాకిస్థాన్ చేరుకుంది. డుప్లెసిస్ నేతృత్వంలోని వరల్డ్ ఎలెవన్ జట్ట సోమవారం ఉదయం లాహోర్‌కు చేరుకుంది.
ఈ సందర్భంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అధికారులు వీరికి ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక బస్సుల్లో భారీ భద్రత నడుమ లాహార్ మెయిన్ మాల్ రోడ్డులోని ఫైవ్ స్టార్ హోటల్‌కు ఆటగాళ్లు చేరుకున్నారు. ఈ మూడు టీ20ల సిరిస్ కోసం పీసీబీ సుమారు తొమ్మిది వేల మంది భద్రతా సిబ్బందిని వినియోగిస్తోంది.
లాహార్‌లోని గడాఫీ స్టేడియంలో సెప్టెంబర్ 12, 13, 15 తేదీల్లో మూడు టీ20 మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ఈ టోర్నీతో రాబోయే రోజుల్లో పాకిస్థాన్‌లో మిగతా దేశాలు కూడా ఆడేందుకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తవన్న సంకేతాలను పంపించాలనే ఉద్దేశంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు టోర్నీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.