హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. తన సహచర క్రికెటర్ల పుట్టినరోజులకు, క్రికెట్‌కు సంబంధించిన పలు అంశాలపై ట్విట్టర్‌లో తనదైన శైలిలో అలరిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా సెహ్వాగ్ నల్లకుబేరులపై మరో పంచ్ ట్వీట్ వేసి అభిమానులను ఆకట్టుకున్నాడు. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వాటిని బ్యాంకుల్లో డిసెంబర్ 30 వరకూ మార్చుకునే వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే.

అయితే ఆ తర్వాత వచ్చే ఏడాది మార్చి 31 వరకూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కి వెళ్లి డిక్లేరన్ ఫారం సమర్పించి మార్చుకోవచ్చు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయంపైనే అందరూ చర్చించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో మార్చి 31 తర్వాత కూడా ఆ ఐదు బ్యాంకులు రూ.500, 1000 నోట్లు స్వీకరిస్తాయని అవి బ్యాంక్స్ ఆఫ్ గంగా, యమునా, సరస్వతీ, నర్మదా, గోదావరి అని సెహ్వాగ్ తనదైన శైలిలో ఛలోక్తి విసురుతూ ట్వీట్ చేశాడు.
కాగా ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నా సంగతి తెలిసిందే. మరోవైపు నల్లధనాన్ని భారీగా ఉంచుకున్న అక్రమార్కులు దానిని వైట్ మనీగా ఎలా చెల్లుబాటు చేసుకోవాలో తెలియక చెత్తకుప్పల్లో, నదుల్లో వేస్తున్న ఘటనలు ఇటీవల చోటుచేసుకున్నాయి.