రాజస్థాన్‌పై ముంబై ఇండియన్స్ అద్భుతమైన విజయం సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో ముంబై బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. చివర్లో టిమ్ డేవిడ్ వరుసగా మూడు సిక్సర్లు బాది ముంబైని విజయతీరాలకు చేర్చాడు. వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఈ క్రమంలోనే తమ ఓటమిపై ఆర్ఆర్ కెప్టెన్ సంజూ శాంసన్ స్పందించాడు.
టైమ్ అవుట్ సమయంలో తాము సూర్యకుమార్ బ్యాటింగ్ గురించే చర్చించుకున్నామని, అతని ఆటతీరు చూస్తే తాము గట్టిగా పోరాడాల్సి ఉంటుందని అనుకున్నామని సంజూ శాంసన్ చెప్పాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సంజూ శాంసన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ నిర్ణయం కరెక్టే అని నిరూపించిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (124) సెంచరీతో చెలరేగాడు.

అయితే మిగతా బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేదు.. అయినా రాజస్థాన్ జట్టు 212 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించడం ముంబైకి కష్టమే అని అంతా అనుకున్నారు. దానికితోడు సందీప్ శర్మ బౌలింగ్‌లో రోహిత్ శర్మ (3) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. ఇలాంటి సమయంలో కామెరూన్ గ్రీన్ (44), సూర్యకుమార్ యాదవ్ (55) అద్భుతంగా ఆడారు.
చివర్లో టిమ్ డేవిడ్ (45 నాటౌట్), తిలక్ వర్మ (29 నాటౌట్) ఇద్దరూ ధాటిగా ఆడుతూ ముంబైని విజయతీరాలకు చేర్చారు. 'సూర్య అవుటైన తర్వాత తాము విజయం దిశగా సాగాం. దాదాపు గెలిచాం అనుకుంటున్న సమయంలో టిమ్ డేవిడ్ అద్భుతంగా ఆడాడు. ఇక్కడ మంచు ప్రభావం కూడా ఉంది కానీ.. మరీ ఎక్కువగా ఏం లేదు. ఈ మాత్రం మంచు ప్రభావం ఉంటుందని మేం ముందే అనుకున్నాం' అని వివరించాడు.
'మంచు ప్రభావాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు. చివరి తొమ్మిది మ్యాచుల్లో మేం గెలిచాం లేదంటే చివరి వరకు గట్టిగా పోరాడి ఓడాం. ఇది చూస్తేనే మేం ఎంత హై స్టాండర్డ్‌లో ఆడుతున్నామో అర్థం చేసుకోవచ్చు. జైస్వాల్ ఈసారి గెలిచిన వైపు లేకపోవడం దురదృష్టకరమే. కానీ వ్యక్తిగతంగా అతని ఆట చూసి చాలా సంతోషిస్తున్నా' అని చెప్పుకొచ్చాడు.