ముంబైలోని వాంఖడే స్టేడియం వేదకిగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ జట్టు అద్భుతంగా ఆడింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే విరాట్ కోహ్లీ (1), అనూజ్ రావత్ (6) ఇద్దరూ పెవిలియన్ చేరారు.
అయితే గ్లెన్ మ్యాక్స్‌వెల్ (68), ఫాఫ్ డుప్లెసిస్ (65) ఇద్దరూ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. అయితే వీళ్లిద్దరూ స్వల్ప వ్యవధిలోనే అవుట్ అవడంతో బెంగళూరు ఆశించిన స్కోరు చేయలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 199 పరుగులే చేసింది. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న వాంఖడే పిచ్‌పై ఇది అంత గొప్ప స్కోరు కాదు.

ఇక ఛేజింగ్‌లో ఇషాన్ కిషన్ (42), సూర్యకుమార్ యాదవ్ (83), నేహాల్ వధీర (52 నాటౌట్) రాణించడంతో ముంబై జట్టు 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయం అనంతరం ముంబై సారధి రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ఈ పిచ్ చాలా బాగుందని, ఆటగాళ్లు దీనికి అలవాటు పడితే మంచి స్కోర్లు చేసే ఛాన్స్ ఉందని పేర్కొన్నాడు.
'మా జట్టులో నలుగురు చక్కగా ఆడారు. ఆకాష్ మంధ్వాల్ గతేడాది కూడా మాతో ఉన్నాడు. ఉత్తరాఖండ్ టీంకు అతనే సారధి. తనకు ఎలాంటి ఫీల్డ్ సెట్ చేసుకోవాలో అతనికి బాగా తెలుసు. తన సత్తా గురించి మాకు అవగాహన ఉంది. దానికి సరిపోయే పాత్ర అతనికి ఇవ్వాలని అనుకున్నాం' అని వివరించాడు.
'ఆర్సీబీని 200లోపు స్కోరుకు పరిమితం చేశాం. అది మా గొప్ప కృషికి దక్కిన ఫలితం. వాళ్లు కనుక 220 అంతకంటే ఎక్కువ స్కోరు చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో? ఈ పిచ్‌పై సేఫ్ స్కోర్ ఏదో నాకు పెద్దగా ఐడియా లేదు. చివరి నాలుగు మ్యాచుల్లో 200 పైగా స్కోర్లు నమోదయ్యాయి' అని చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం ఐపీఎల్ చాలా కీలకమైన దశలో ఉండటంతో జట్లు కూడా రిస్క్ తీసుకుంటున్నాయని రోహిత్ అన్నాడు. 'చాలా టీమ్స్ రిస్క్ తీసుకోవడానికి వెనుకాడటం లేదు. అది కలిసొస్తోంది కూడా. బ్యాటర్లు రిస్క్ తీసుకుంటున్నారు. దీంతో 200 పైన స్కోర్లు కూడా ఛేజ్ చేసేస్తున్నాం. జట్టు కోసం ఏదైనా స్పెషల్‌గా చేయాలనే మైండ్ సెట్‌తో ప్లేయర్లు ఉన్నారు. అది జట్టుకు మేలు చేస్తోంది' అని పేర్కొన్నాడు.