ముంబైలోని వాంఖడే స్టేడియం వేదకిగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ జట్టు అద్భుతంగా ఆడింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే విరాట్ కోహ్లీ (1), అనూజ్ రావత్ (6) ఇద్దరూ పెవిలియన్ చేరారు.
అయితే గ్లెన్ మ్యాక్స్‌వెల్ (68), ఫాఫ్ డుప్లెసిస్ (65) ఇద్దరూ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. అయితే వీళ్లిద్దరూ స్వల్ప వ్యవధిలోనే అవుట్ అవడంతో బెంగళూరు ఆశించిన స్కోరు చేయలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 199 పరుగులే చేసింది. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న వాంఖడే పిచ్‌పై ఇది అంత గొప్ప స్కోరు కాదు.

ఇక ఛేజింగ్‌లో ముంబైకి ఇషాన్ కిషన్ (42) మంచి ఆరంభం ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 83) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతనితోపాటు మరో యువ ప్లేయర్ నేహాల్ వధీర (52 నాటౌట్) కూడా రాణించాడు. దీంతో ముంబై జట్టు 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
ఈ మ్యాచ్ చూసిన ఫ్యాన్స్ ఆర్సీబీని తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ ఐపీఎల్‌లో బౌలింగ్ యూనిట్ బలంగా లేని జట్లలో ముంబై ఒకటి. అలాగే రోహిత్ శర్మ వంటి కీలక బ్యాటర్ కూడా ఫామ్‌లో లేడు. అలాంటి బలహీనమైన ముంబై కూడా ఆర్సీబీని ఈజీగా ఓడించేయడంపై ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇంత వీక్ టీం చేతిలో కూడా చిత్తుగా ఓడాలంటే అది ఆర్సీబీకే సాధ్యం అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో ఆర్సీబీ అంటే చాలు సూర్యకుమార్‌కు పూనకం వచ్చేస్తుందని అంటున్నారు. ఏదేమైనా ఈ ఓటమితో ఆర్సీబీ ప్లేఆఫ్స్ అవకాశాలు బాగా దెబ్బతిన్నాయి. ఈ లెక్కన ఆ టీం ప్లేఆఫ్స్ చేరకపోయినా ఆశ్చర్యం లేదు.