ఐపీఎల్ చాలా ఇంపార్టెంట్ దశకు చేరుకుంది. అన్ని జట్లు కనీసం పది మ్యాచులు ఆడేశాయి. అయితే ప్లేఆఫ్స్ చేరే చివరి రెండు స్థానాల కోసం చాలా జట్లు పోటీలో ఉన్నాయి. ఇవన్నీ కూడా పదేసి పాయింట్లతో ఉండటంతో టోర్నమెంట్ చాలా ఆసక్తికరంగా మారింది. ఈ రేసులో ఉన్న రెండు కీలకమైన జట్లు మంగళవారం తలపడనున్నాయి.
అవే ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ కీలకమైన మ్యాచ్‌కు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికకానుంది. ఇంతకుముందు లీగ్ ఆరంభంలో ఈ రెండు జట్లు చిన్నస్వామి స్టేడియంలో తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ ఇద్దరూ అద్భుతమైన ఫామ్ కనబరిచారు. దీంతో ముంబైకి ఓటమి తప్పలేదు.

అయితే ఇప్పుడు ముంబై బ్యాటర్లు కూడా ఫామ్ అందుకున్నారు. దీంతో ముంబై కూడా మంచి జోరు మీదనే ఉంది. కానీ ఆ జట్టు బౌలింగ్ యూనిట్ అంత బలంగా కనిపించడం లేదు. అదే సమయంలో ఆర్సీబీ కూడా తమ చివరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో చిత్తుగా ఓడింది. ఈ టీం బౌలింగ్ యూనిట్ అంతా కలిసికట్టుగా విఫలమైందా మ్యాచ్‌లో.
ఈ క్రమంలో ప్లేఆఫ్స్ రేసులో ముందుడుగు వేయడానికి రెండు జట్లు ఆశగా ఎదురు చూస్తున్నాయి. ఇలాంటి కీలక మ్యాచ్‌కు ముందు ముంబై మెంటార్ సచిన్ టెండూల్కర్, ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ కలిశారు. ఇద్దరూ సరదాగా నవ్వుకుంటూ ముచ్చట్లు చెప్పుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆర్సీబీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.
ఈ ఫొటోలను షేర్ చేసిన ఆర్సీబీ ట్విట్టర్ హ్యాండిల్.. '59679 పరుగులు.. 175 అంతర్జాతీయ శతకాలు.. లక్షల జ్ఞాపకాలు.. అన్నీ ఒకే ఫ్రేమ్‌లో' అని క్యాప్షన్ తగిలించింది. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో క్రికెట్ దేవుడు, కింగ్ కలిసి కనిపిస్తున్నారని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.