ఐపీఎల్ కీలక దశకు చేరుకుంది. అన్ని జట్లు కనీసం పది మ్యాచులు ఆడేశాయి. అయితే ప్లేఆఫ్స్ చేరే చివరి రెండు స్థానాల కోసం చాలా జట్లు పోటీలో ఉన్నాయి. ఇవన్నీ కూడా పదేసి పాయింట్లతో ఉండటంతో టోర్నమెంట్ చాలా ఆసక్తికరంగా మారింది. ఈ రేసులో ఉన్న రెండు కీలకమైన ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడేందుకు రెడీ అయ్యాయి.
బైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈ రెండు టీమ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో ఏకంగా మూడో స్థానానికి చేరుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ రెండు జట్లకు చాలా ముఖ్యంగా మారింది. లీగ్ ఆరంభంలో ఈ రెండు జట్లు చిన్నస్వామి స్టేడియంలో తలపడ్డాయి.

ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ ఇద్దరూ అద్భుతమైన ఫామ్ కనబరిచారు. దీంతో ముంబైకి ఓటమి తప్పలేదు. అయితే ఇప్పుడు ముంబై బ్యాటర్లు కూడా ఫామ్ అందుకున్నారు. ఈ క్రమంలో ముంబై బ్యాటింగ్ చాలా బలంగా కనిపిస్తోంది. అదే సమయంలో ఆర్సీబీ బ్యాటింగ్ ఎక్కువగా కోహ్లీ, ఫాఫ్, మ్యాక్స్‌వెల్ మీదనే ఆధారపడుతోంది.
చివరి మ్యాచ్‌లో లోమ్రోర్ రాణించినా.. అతను ఆ ఫామ్ కొనసాగిస్తాడా? అనేది అనుమానమే. ఇక మ్యాక్స్‌వెల్ ఆట కూడా నిలకడ లేకుండా ఉంది. అయితే మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ లేదంటే చెత్త పెర్ఫామెన్స్.. ఇలా సాగుతోంది అతని ఆట. కోహ్ల రాణిస్తున్నా అతను కూడా తన ఆటలో వేగం పెంచాల్సిన అవసరం ఉంది. దీంతో ఫాఫ్‌పై ఒత్తిడి పెరుగుతోంది.
ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ కూడా లోపాల పుట్టగా కనిపిస్తోంది. ఢిల్లీపై సిరాజ్ ఆఫ్-డే ఆ జట్టును బాగా దెబ్బతీసింది. హసరంగ తన బెస్ట్ పెర్ఫామెన్స్ ఇవ్వడం లేదు. హర్షల్ పటేల్ భారీగా పరుగులు ఇస్తున్నాడు. ఈ విషయంలో ముంబై కూడా తడబడుతూనే ఉంది. అయితే జోఫ్రా ఆర్చర్ తను మళ్లీ ఫామ్ అందుకుంటున్నట్లు సూచనలు ఇస్తున్నాడు.
కానీ ఆ జట్టు స్పిన్ బౌలింగ్ విభాగం ఏమాత్రం బాగలేదు. ఒక్క పీయూష్ చావ్లా మాత్రమే రాణిస్తున్నాడు. మిగతా బౌలర్లు అందరూ తేలిపోతున్నారు. ఈ మ్యాచ్‌లో ఛేజింగ్ చేసే టీంకు అడ్వాంటేజి దక్కే ఛాన్స్ ఉంది. కాబట్టి టాస్ కూడా ఈ మ్యాచ్‌కు కీలకంగా మారుతుంది. కానీ టాస్ విషయం పక్కన పెడితే గెలిచే ఛాన్సులు మాత్రం ముంబై వైపే మొగ్గుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూద్దాం.