పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ చివరి ఓవర్లో తడబడింది. దీంతో ఈ మ్యాచ్‌లో ఆ టీం ఓటమిపాలైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు అనుకున్న ఆరంభం దక్కలేదు. అయితే కొత్త కుర్రాళ్లు ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (26), అథర్వ టైడే (29), హర్‌ప్రీత్ సింగ్ (41) చెలరేగారు. వీరికితోడు కెప్టెన్ శామ్ కర్రాన్ (55) కూడా అదరగొట్టాడు.
ముఖ్యంగా డెత్ ఓవర్లలో ముంబై బౌలర్లపై వీళ్లు ఎదురు దాడికి దిగారు. చివర్లో జితేశ్ శర్మ కేవలం 7 బంతుల్లోనే 25 పరుగులతో అలరించాడు. దీంతో ఆ టీం 214 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో ముంబైకి కూడా మంచి ఆరంభం దక్కలేదు. ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్ (1) భారీ షాట్ ఆడబోయి పెవిలియన్ చేరాడు. కానీ రోహిత్ శర్మ (44), కామెరూన్ గ్రీన్ (67), సూర్యకుమార్ యాదవ్ (57) ఆకాశమే హద్దుగా చెలరేగారు.

చివరి ఓవర్లో ముంబై విజయానికి 16 పరుగులు అవసరమయ్యాయి. ఇలాంటి సమయంలో బంతి అందుకున్న అర్షదీప్ సింగ్ సూపర్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. కేవలం రెండు పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. దీంతో ముంబై 13 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమిపై ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. తాము ఈ మ్యాచ్ గెలవాల్సిందని, గట్టిగా పోరాడామని చెప్పాడు.
'మైదానంలో మేం కొన్ని తప్పులు చేశాం. కానీ వాటిని మరీ సీరియస్‌గా తీసుకొని బాధ పడాల్సిన అవసరం లేదు. మంచి పోరాటం చేసినందుకు తల ఎత్తుకొని ఉండాలని కుర్రాళ్లకు చెప్తా. మేం మూడు మ్యాచులు గెలిచాం. మూడింట ఓడాం. ఇంకా టోర్నమెంట్లో చాలా సమయం ఉంది. మేం చక్కగా ఆడుతూ టోర్నీలో మంచి పొజిషన్‌లో ఉండాలి. గ్రీన్, స్కై బ్యాటింగ్ చూస్తే చాలా సంతోషంగా ఉంది' అని రోహిత్ అన్నాడు.
అలాగే ఈ మ్యాచ్‌లో తాము ఓడిపోవడానికి అర్షదీప్ కారణమని చెప్పాడు. డెత్ ఓవర్లలో పంజాబ్ చక్కగా బౌలింగ్ చేసిందన్నాడు. 'ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసినందుకు అర్షదీప్ సింగ్‌కు క్రెడిట్ తప్పకుండా ఇవ్వాలి. ఇది మా రోజు కాదంతే. కానీ మేం చాలా గొప్ప పోరాట స్ఫూర్తి కనబరిచాం' అని రోహిత్ పేర్కొన్నాడు.