ఐపీఎల్ 2023లో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్‌కు అంతా రెడీ అయింది. వరుసగా రెండు మ్యాచుల్లో విజయం సాధించిన ముంబై జోరు మీద ఉంటే.. చివరి మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన పంజాబ్ ఎలాగైనా మళ్లీ విజయాల బాట పట్టాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ముంబై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచాడు.
వాతావరణం చాలా బాగుందని, ఈ మ్యాచ్‌లో ముందుగా తాము ఫీల్డింగ్ చేస్తామని రోహిత్ చెప్పాడు. తమ జట్టులో పెద్దగా మార్పులేం లేవని, తమ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ తిరిగి వస్తున్నాడని వెల్లడించాడు. అదొక్కటే తమ జట్టులో మార్పు అని స్పష్టం చేశాడు. మళ్లీ తమ జట్టు విజయాల బాట పట్టినందుకు సంతోషంగా ఉందని చెప్పిన అతను.. తమ బ్యాటింగ్ చాలా బలంగా ఉందన్నాడు.

పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధవన్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఈ కారణంగా అతను ఈ మ్యాచ్‌లో కూడా ఆడటం లేదు. దీంతో మరోసారి శామ్ కర్రాన్ ఈ జట్టు సారధ్య బాధ్యతలు నిర్వర్తించేందుకు రెడీ అయ్యాడు. టాస్ సమయంలో ఇదే విషయం చెప్పిన శామ్.. ధవన్ కోలుకొని ఉంటే తాను టాస్‌కు రావలసిన అవసరం ఉండేది కాదని నవ్వేశాడు.
తమ జట్టులో ఎలాంటి మార్పులూ లేవని, చివరి మ్యాచ్ ఆడిన జట్టుతోనే బరిలో దిగుతున్నామని శామ్ కర్రాన్ తెలిపాడు. టాస్ గెలిచి ఉంటే తాను కూడా ముందుగా బౌలింగ్ ఎంచుకునే వాడినన్నాడు. ఇక ఇప్పుడు పరిస్థితులను ఉపయోగించుకొని మంచి స్కోరు చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పాడు.
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, తిలక్ వర్మ, అర్జున్ టెండూల్కర్, హృతిక్ షోకీన్, జోఫ్రా ఆర్చర్, పియూష్ చావ్లా, జేసన్ బెహ్రెండాఫ్
పంజాబ్ కింగ్స్: అథర్వ టైడే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, మాథ్యూ షార్ట్, లియామ్ లివింగ్‌స్టోన్, హర్‌ప్రీత్ సింగ్, శామ్ కర్రాన్ (కెప్టెన్), జితేశ్ శర్మ, షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, అర్షదీప్ సింగ్, రాహుల్ చాహర్