సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్.. ముంబై ఇండియన్స్ కొంప ముంచాడు. పంజాబ్‌తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో అతని వల్లనే పంజాబ్ భారీ స్కోరు చేసిందని చెప్పాలి. ఈ మ్యాచ్ ఆరంభంలో చక్కగా ఆడుతున్న పంజాబ్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (26)ను సూపర్ యార్కర్‌తో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు అర్జున్. దీంతో అతను సూపర్ బౌలింగ్ చేస్తున్నాడని అంతా అనుకున్నారు.
కానీ ఆ తర్వాత అతనే ముంబైకి పీడకలగా మారాడు. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (26), అథర్వ టైడే (29) అవుటైన తర్వాత లివింగ్‌స్టోన్ (10) మరోసారి విఫలమయ్యాడు. దీంతో పది ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ 4 వికెట్ల నష్టానికి 83 పరుగులతో నిలిచింది. ఇది చూసిన వాళ్లందరూ పంజాబ్‌ను తక్కువ స్కోరుకే ముంబై కట్టడి చేస్తుందని అనుకున్నారు. కెప్టెన్ శామ్ కర్రాన్ (55), హర్‌ప్రీత్ సింగ్ (41) ఇద్దరూ కూడా అలాగే ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేశారు.

ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. 14 ఓవర్లకు 105/4 స్కోరుతో ఉన్న ఆ జట్టుకు అర్జున్ వేసిన 16వ ఓవర్లు ఫుల్ జోష్ వచ్చింది. హర్‌ప్రీత్ సింగ్ ఈ ఓవర్లో చెలరేగాడు. ఈ ఓవర్ తొల మూడు బంతులకు 11 పరుగులు చేశాడు కర్రాన్. ఆ తర్వాత అర్జున్ బౌలింగ్ ఎదుర్కొన్న హర్‌ప్రీత్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. అర్జున్ ఒక నోబాల్ కూడా వేశాడు. దీంతో ఆ ఓవర్లో ఏకంగా 31 పరుగులు వచ్చాయి.
ఈ ఐపీఎల్‌లో ఒక ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన రికార్డును అర్జున్ సమం చేశాడు. అంతేకాదు ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ తరఫున రెండో అతి చెత్త ఓవర్ ఇదే. ఈ ఓవర్‌తో మ్యాచ్ మొమెంటం పంజాబ్ వైపు మొగ్గింది. ఇక్కడి నుంచి ఊచకోత మొదలు పెట్టిన పంజాబ్ బ్యాటర్లు.. చివరి ఐదు ఓవర్లలో 96 పరుగులు చేసి ముంబై ముందు 215 పరుగుల భారీ టార్గెట్ ఉంచారు.
అర్జున్ కేవలం ఈ ఓవర్లోనే దారుణంగా బౌలింగ్ చేశాడు. అతను మొత్తం మూడు ఓవర్లలో 48 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. అంటే ఈ ఓవర్ తీసేస్తే మిగతా రెండు ఓవర్లలో అతను ఇచ్చింది కేవలం 17 పరుగులే. అయితే ఈ ఒక్క ఓవర్ అతన్ని పెద్ద విలన్‌గా మార్చేసింది. మ్యాచ్ ఆరంభంలో అర్జున్ వేసిన యార్కర్ చూసి సూపర్ అనుకుంటే.. చివర్లో ఇంత చెత్తగా బౌలింగ్ వేశావేంటి? అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. ఆ ఒక్క ఓవర్‌తో అర్జున్ గణాంకాలు మారిపోయాయి.