ఐపీఎల్‌లో ఆర్సీబీ, లక్నో మ్యాచ్‌లో కోహ్లీతో లక్నో టీం గొడవ పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత లక్నో ఎక్కడ ఆడుతున్నా కూడా ఆ టీం పేసర్ నవీన్ ఉల్ హక్‌ను ఫ్యాన్స్ టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అతను, గంభీర్ కనిపిస్తే చాలాు 'కోహ్లీ.. కోహ్లీ..' అంటూ అరుస్తూ ఎగతాళి చేస్తున్నారు. అదే సమయంలో నవీన్ పెర్ఫామెన్స్ కూడా పడిపోవడంతో ఇది మరింత పెరిగింది.
అయితే ముంబైతో జరిగిన ఎలిమినేటర్‌లో నవీన్ సూపర్‌గా బౌలింగ్ చేశాడు. ముంబై బ్యాటింగ్ లైనప్‌లో నలుగురు కీలక ఆటగాళ్లను అవుట్ చేశాడు. కానీ లక్నో బ్యాటింగ్ లైనప్ దారుణంగా విఫలం అవడంతో ఆ టీం ఓడిపోయి ఇంటి దారి పట్టింది. ఈ క్రమంలో తనను ఇలా ఫ్యాన్స్ టార్గెట్ చేయడం గురించి నవీన్ మాట్లాడాడు.

'నన్ను అలా టార్గెట్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తా. స్టేడియంలో అందరూ అతని పేరునో, లేదంటే మరో ప్లేయర్ పేరునో పిలవడం నాకు నచ్చుతుంది. దాని వల్ల నాలో నా టీంకు మరింత బాగా ఆడాలనే కసి పెరుగుతుంది' అని చెప్పాడు. అదే సమయంలో తను బయట నుంచి వచ్చే గొడవలపై ఎక్కువ ఫోకస్ పెట్టనని కూడా అన్నాడు.
'బయట జరిగే ఈ గొడవల గురించి అసలు పట్టించుకోను. నా క్రికెట్ మీదనే ఫోకస్ పెడతా. అంటే ప్రేక్షకులు అలా అరవడం, ఇంకెవరైనా ఏమైనా అంటే నా మీద ప్రభావం పడదని కాదు. కానీ ప్రొఫెషనల్ క్రీడాకారుడిగా వాటన్నింటినీ తీసుకుంటూ ముందుకు వెళ్లాలి' అని వివరించాడు. ముంబైతో ఆర్సీబీ మ్యాచ్ సమయంలో కోహ్లీ అవుటైనప్పుడు మామిడి పండ్ల ఫొటోను నవీన్ షేర్ చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు లక్నో కూడా ఎలిమినేటర్‌లో ఓడిపోవడంతో ఫ్యాన్స్ ఈ మామిడి పండ్ల మీమ్స్‌తో ఇంటర్నెట్‌ను హోరెత్తిస్తున్నారు. దీంతో లక్నో ట్విట్టర్ అడ్మిన్ ఈ పదాలను మ్యూట్ చేసుకోవాల్సి వచ్చింది. అంతగా ఫ్యాన్స్ ఈ టీంను ట్రోల్ చేస్తున్నారు. మరి వచ్చే సీజన్‌లో నవీన్ ఎలా ఆడతాడో చూడాలి.