క్రికెట్‌లో డీఆర్ఎస్ (డెసిషన్ రివ్యూ సిస్టం) తీసుకొచ్చిన మార్పులు సాధారణమైనవి కావు. అంపైర్లు పొరపాటు పడి తప్పుడు డెసిషన్లు ఇచ్చినప్పుడు వాటిని ప్లేయర్లు ఛాలెంజ్ చేసి, థర్డ్ అంపైర్‌కు అప్పీల్ చేసుకునే అవకాశం ఈ డీఆర్ఎస్ వల్ల లభించింది. దీని వల్ల ఎన్నో మ్యాచుల్లో ఫలితాలు మారాయనడం అతిశయోక్తి కాదు. అయితే అందరిలా ప్రతి చిన్న దానికీ రివ్యూ కోరకుండా జాగ్రత్తగా ఆలోచించి రివ్యూ తీసుకునే వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు.
అలాంటి వాళ్ల జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ సారధి ఎంఎస్ ధోనీ ఒకడు. ఎప్పుడూ కూల్‌గా ఉండే అతను.. సాధారణంగా రివ్యూ కోరడు. ఆ రివ్యూ వేస్ట్ అవుతుందని ఏమాత్రం అనుమానం ఉన్నా అతను రివ్యూ తీసుకోడు. అదే సమయంలో అంపైర్ ఇచ్చిన నిర్ణయం తప్పు అని తనకు రూఢీగా తెలిస్తే రివ్యూ కోరుకుండా ఉండడు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో కూడా అలాగే జరిగింది.

సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేస్తుండగా.. శాంట్నర్‌కు ధోనీ బంతి అందించాడు. శాంట్నర్ వేసిన బంతిని స్వీప్ ఆడేందుకు సూర్య ప్రయత్నించాడు. అయితే అతని షాట్ మిస్ అయింది. బంతి ధోనీ చేతుల్లో పడింది. కానీ బంతి అందుకున్న ధోనీ క్యాచ్ అవుట్ కోసం అప్పీల్ చేశాడు. అంపైర్ దాన్ని సీరియస్‌గా తీసుకోకుండా వైడ్ ఇచ్చాడు. చాలా మంది కుర్ర వికెట్ కీపర్లు కూడా ఇలా ప్రతి చిన్న దానికీ అప్పీల్ చేస్తుంటారని మనందరికీ తెలిసిందే.
కానీ ధోనీ అలాంటి వాడు కాదు. తనకు బలంగా అనిపిస్తేనే అవుట్ కోసం అప్పీల్ చేస్తాడు. సూర్య విషయంలో కూడా అదే జరిగింది. అంపైర్ వైడ్ ఇచ్చిన వెంటనే ధోనీ రివ్యూ కోరాడు. రిప్లేలో సూర్య గ్లవ్‌ను బంతి తాకినట్లు తేలింది. దీంతో అంపైర్ నిర్ణయం మార్చుకోగా.. సూర్య పెవిలియన్ బాటపట్టాడు. ఇది చూసిన ఫ్యాన్స్ నెట్టింట రెచ్చిపోయారు. డీఆర్ఎస్ అంటే ధోనీ రివ్యూ సిస్టం అని, అతను రివ్యూ కోరితేనే బ్యాటర్లు మైదానం వీడిపోతారని కామెంట్లు చేస్తున్నారు.