చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై బ్యాటర్లు తేలిపోయారు. యువ బ్యాటర్ నేహాల్ వధీర (64) ఒక్కడే రాణించాడు. చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన ముంబై ముందుగా బ్యాటింగ్‌కు వచ్చింది. ఈ జట్టుకు తుషార్ దేశ్‌పాండే మొదటి ఝలక్ ఇచ్చాడు. అద్భుతమైన డెలివరీతో ఓపెనర్‌గా వచ్చిన కామెరూన్ గ్రీన్ (6)ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
ఆ వెంటనే భారీ షాట్ ఆడబోయిన ఇషాన్ కిషన్ (7) కూడా అవుటయ్యాడు. దీపక్ చాహర్ వేసిన బంతికి తడబడిన అతను అనవసరంగా దాన్ని గాల్లోకి లేపడంతో తీక్షణకు సులభమైన క్యాచ్ దక్కింది. కిషన్ అవుటైన కాసేపటికే దీపక్ చాహర్ బౌలింగ్‌లోనే ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ (0) డకౌట్ అయ్యాడు. చాహర్ డెలివరీని ఏమాత్రం ఊహించలేకపోయిన రోహిత్ స్కూప్ ఆడబోయి జడేజాకు సింపుల్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

ఆ తర్వాత నేహాల్ వధీర, సూర్యకుమార్ యాదవ్ (26) కాసేపు ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ జడేజా బౌలింగ్‌లో సూర్య కూడా పెవిలియన్ చేరాడు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన ట్రిస్టియన్ స్టబ్స్ (20) జాగ్రత్తగా ఆడాడు. చివరి రెండు ఓవర్లలో దేశ్‌పాండే, పతిరాణా బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడబోయిన టిమ్ డేవిడ్ (2), అర్షద్ ఖాన్ (1), స్టబ్స్ పెవిలియన్‌కు క్యూ కట్టారు.
ఇలా బ్యాటర్లు అందరూ చేతులెత్తేయడంతో ముంబై జట్టు అనుకున్నంత స్కోరు చేయలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి కేవలం 139 పరుగులే చేసింది. చెన్నై బౌలర్లలో పతిరాణా మూడు వికెట్లతో చెలరేగాడు. దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే చెరో రెండు వికెట్లతో ఆకట్టుకున్నారు. జడేజా కూడా కీలకమైన సూర్యకుమార్ వికెట్ తీసుకున్నాడు. ఈ చిన్న లక్ష్యాన్ని చూసిన ముంబై అభిమానులు.. తిలక్ వర్మ లేని లోటు స్పష్టంగా కనిపించిందని అంటున్నారు.