
హైదరాబాద్: భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్, సీనియర్ ప్లేయర్ మిథాలీ రాజ్ బయోపిక్ వస్తున్న విషయం తెలిసిందే. మిథాలీ బయోపిక్‌లో స్టార్ హీరోయిన్ తాప్సీ టైటిల్ పాత్రలో నటిస్తోంది. 'శభాష్ మిథు' పేరుతో దర్శకుడు రాహుల్ ధోలాకియా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. వయాకామ్ 18 స్టూడియోస్ నిర్మిస్తోంది. రాహుల్ బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్‌తో 'రాయీస్' మూవీ రూపొందించిన సంగతి విదితమే.
అయితే బుధవారం 'శబాష్ మిథు' సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. చిత్ర యూనిట్ తాప్సీకి సంబందించిన ఓ ఫొటోను విడుదల చేసింది. ఇందులో మిథాలీ పాత్రలో తాప్సీ ఒదిగిపోయారు. స్టైలిష్ షాట్ కొడుతున్నట్టుగా ఉన్న ఫస్ట్ లుక్‌లో అచ్చం మిథాలీలానే తాప్సీ కనిపిస్తోంది. 2021 ఫిబ్రవరి 2న సినిమాను విడుదల చేయనున్నట్లు పోస్టర్ ద్వారా తెలుస్తోంది.
క్రికెట్ దిగ్గజాలైన మహేంద్ర సింగ్ ధోనీ, సచిన్ టెండూల్కర్‌ల మీద వచ్చిన బయోపిక్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అదే స్ఫూర్తితో మిథాలీ జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కుతోంది. మరోవైపు బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బయోపిక్ కూడా సిద్దమవుతోంది. పరిణితీ చోప్రా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీ కోసం బ్యాడ్మింటన్‌లో ఆమె ప్రత్యేక శిక్షణ తీసుకుంది. మహిళా క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర నెలకొల్పిన భారత ఫాస్ట్ బౌలర్ జులన్ గోస్వామిపై కూడా ఓ బయోపిక్ తీయనున్నారు.
16 ఏళ్ల వయసులో 1999లో వన్డేల్లో అరంగేట్రం చేసిన మిథాలీ.. ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ చేసింది. ఇక 19 ఏళ్ల వయసులో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 214 పరుగులు చేసి టెస్టుల్లో రెండో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా అరుదైన గుర్తింపు సాధించింది. 18 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో మిథాలీ రాజ్ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. ఇటీవలే వన్డేల్లో వరుసగా ఏడు అర్ధ సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది.
అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో మిథాలీ రాజ్ అనేక రికార్డులను సృష్టించింది. మహిళల వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా మిథాలీ చరిత్ర సృష్టించింది. మిథాలీ భారత్ తరఫున 10 టెస్టులు, 209 వన్డేలు, 89 టీ20లు ఆడింది. టెస్టులలో 663, వన్డేలలో 6888, టీ20లలో 2364 పరుగులు చేసింది.