హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సోమవారం వన్డే ర్యాంకుల జాబితాను విడుదల చేసింది. ఈ ర్యాంకుల జాబితాలో భారత్‌కు చెందిన మహిళా క్రికెటర్లు తమ తమ ర్యాంకులను మెరుగుపరచుకున్నారు.
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ మహిళల ర్యాంకుల జాబితాలో అగ్రస్ధానంలో నిలిచింది. 753 రేటింగ్ పాయింట్లతో మిథాలీ రాజ్ నెంబర్ వన్ ర్యాంకులో నిలిచింది. ఆస్ట్రేలియాకు చెందిన మహిళా క్రికెటర్ ఎలీస్ పెర్రీ (725), దక్షిణాఫ్రికాకు చెందిన అమీ శాటర్త్‌వైట్ (720)రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు.

ఆస్ట్రేలియాకు చెందిన మెగ్ లానింగ్ గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే సిరిస్‌కు దూరం కావడంతో ఒకటో నెంబర్ ర్యాంకు నుంచి నాలుగో ర్యాంకుకి పడిపోయింది. ఇక బౌలర్ల విషయానికి వస్తే టీమిండియా వెటనర్ బౌలర్ ఝలన్ గోస్వామి 652 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలోనే కొనసాగుతోంది.
దక్షిణాఫ్రికా బౌలర్ మారిజానె క్యాప్ 656 రేటింగ్ పాయింట్లతో నెంబర్ వన్ స్ధానంలో కొనసాగుతోంది. తాజాగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న వన్డే సిరిస్‌ను 2-1తో కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా మహిళల జట్టు తిరిగి అగ్రస్ధానంలో నిలిచింది. 2021లో నిర్వహించే ఐసీసీ మహిళల ప్రపంచకప్ కోసం ఇప్పటికే వన్డే ఛాంపియన్‌షిప్ ప్రారంభమైన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఐసీసీ సోమవారం ప్రకటించిన ర్యాంకుల జాబితాలో కోహ్లీ మళ్లీ నెంబర్ వన్ ర్యాంక్‌ని అందుకున్నాడు. అంతేకాదు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డు ఒకటి బద్దలు కొట్టాడు. ఇప్పటివరకు ఓ భారత క్రికెటర్ సాధించిన అత్యధిక రేటింగ్ పాయింట్లు సచిన్ టెండూల్కర్ (887 రేటింగ్ పాయింట్లు) పేరిట ఉంటేది. అయితే ఇప్పుడు ఆ రికార్డుని కోహ్లీ 889 పాయింట్లతో అధిగమించాడు.