హైదరాబాద్: ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో భారత మహిళా బ్యాట్స్ మెన్లు సత్తా చాటారు. భారత మహిళల వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్, టాప్ బ్యాట్స్ ఉమెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్‌లు టాప్ 10లో నిలిచారు.
ఫిబ్రవరి 14వ తేదీన ప్రకటించిన ర్యాంకుల్లో మొట్టమొదటి సారి రెండో స్ధానాన్ని కైవసం చేసుకున్న మిథాలీ రాజ్, కొలంబోలో వన్డే వరల్డ్ క్వాలిఫయిర్స్ టోర్నీ ముగిసిన తర్వాత విడుదల చేసిన జాబితాలో తన రెండో ర్యాంకుని నిలెబట్టుకుంది.

బుధవారం ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో కెప్టెన్ మిథాలీరాజ్ 733 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో కొనసాగగా, హర్మన్‌ప్రీత్ కౌర్ 574 పాయింట్లతో తన కెరీర్‌లోనే తొలిసారి అత్యుత్తమంగా 10వ ర్యాంకు సాధించింది.
ఆస్ట్రేలియాకు చెందిన మెగ్ లానింగ్ 804 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం ముగిసిన వరల్డ్‌కప్ అర్హత టోర్నీలో అద్భుతంగా రాణించడంతో మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ ర్యాంకింగ్స్ మెరుగయ్యాయి.

మరోవైపు బౌలర్ల జాబితాలో గాయం కారణంగా అర్హత టోర్నీ నుంచి తప్పుకున్న జులాన్ గోస్వామి మూడో స్థానం కొనసాగుతుండగా, ఏక్తా బిస్త్ ఎనిమిదో ర్యాంకులో నిలిచింది. ఆల్‌రౌండర్ల జాబితాలో జులన్ గోస్వామి ఏడవ ర్యాంకులో నిలిచింది.