
హైదరాబాద్: భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్, సీనియర్ ప్లేయర్ మిథాలీ రాజ్ అరుదైన ఘనత అందుకున్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తర్వాత సుదీర్ఘ కాలం ఆడిన రెండో క్రికెటర్‌గా మిథాలీ రికార్డు సృష్టించారు. అంతర్జాతీయ క్రికెట్లో మిథాలీ 22 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. 1999 జూన్ 26న మిథాలీ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశారు. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచుతో 22 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య బ్రిస్టోల్‌లోని కౌంటీ మైదానంలో తొలి మ్యాచ్ జరిగింది.
అతి త్వరలో సచిన్ టెండూల్కర్ రికార్డును మిథాలీ రాజ్ బ్రేక్ చేయనున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక కాలం క్రికెట్ ఆడిన ఘనత ఇప్పటి వరకు సచిన్ పేరుతో ఉంది. క్రికెట్ దిగ్గజం 22 ఏళ్ల 91 రోజుల పాటు ఆటలో కొనసాగారు. మరో మూడు నెలలు ఆడితే.. మిథాలీ సచిన్ రికార్డును అధిగమిస్తారు. ప్రస్తుతం మిథాలీ టెస్ట్, వన్డే క్రికెట్ మాత్రమే ఆడుతున్నారు. గతేడాదే టీ20లకు గుడ్‌బై చెప్పేశారు. వచ్చే ఏడాది జరిగే మహిళల వన్డే ప్రపంచకప్ వరకు ఆడి వీడ్కోలు పలుకుతానని ఆమె ఇదివరకే స్పష్టం చేశారు. దీంతో సచిన్ రికార్డును మిథాలీ కచ్చితంగా బ్రేక్ చేయనున్నారు.
ఇప్పటి వరకు మహిళల క్రికెట్లో అత్యధిక వన్డేలు ఆడిన క్రికెటర్ కూడా 38 ఏళ్ల మిథాలీ రాజే ఉన్నారు. 216 మ్యాచులాడి 7170 పరుగులు చేశారు. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో మిథాలీ కీలక ఇన్నింగ్స్ ఆడారు. 27/2తో కష్టాల్లో పడ్డ జట్టును తనదైన శైలిలో ఆదుకున్నారు. పూనమ్ రౌత్ (32)తో కలిసి 56, దీప్తి శర్మ (30)తో కలిసి 65 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పారు. 95 బంతుల్లో అర్ధ శతకం చేసిన మిథాలీ.. చివరకు 72 పరుగులు చేసి ఔట్ అయ్యారు.
అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో మిథాలీ రాజ్ అనేక రికార్డులను సృష్టించారు. మిథాలీ భారత్ తరఫున 11 టెస్టులు, 215 వన్డేలు, 89 టీ20లు ఆడారు. టెస్టులలో 669, వన్డేలలో 7170, టీ20లలో 2364 పరుగులు చేశారు. మొత్తంగా 8 సెంచరీలు చేశారు. ఇక మిథాలీ బయోపిక్ వస్తున్న విషయం తెలిసిందే. మిథాలీ బయోపిక్ 'శభాష్ మిథు'లో బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్నూ నటిస్తున్నారు. దర్శకుడు రాహుల్ ధోలాకియా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. వయాకామ్ 18 స్టూడియోస్ నిర్మిస్తోంది.