లార్డ్స్ లార్డ్.. స్టార్క్! సెమీస్ ముంగిట్లో బ్లాక్ క్యాప్స్ బోల్తా

లండన్: ఒక్క మ్యాచ్. ఇంకొక్క మ్యాచ్ గెలిస్తే.. ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్ టోర్నమెంట్ సెమీ ఫైనల్ దూసుకెళ్లే అవకాశం ఉన్న జట్టు అది. టోర్నమెంట్ ఆరంభం నుంచి మొన్నటికి మొన్న పాకిస్తాన్ ఎదురు పడేంత వరకూ తిరుగులేని విజయాలను నమోదు చేసిన టీమ్ అది. ఛప్పున చతికిల పడింది. పాకిస్తాన్ గ్రీన్ ఆర్మీ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోక ముందే.. కంగారూల ధాటికీ బెంబేలెత్తింది న్యూజీలాండ్ క్రికెట్ టీమ్. వరుసగా రెండు పరాజయాలతో సెమీ ఫైనల్ ముంగిట్లో పల్టీలు కొడుతోంది. ఇక జట్టు ఆడాల్సింది ఒకే ఒక్క మ్యాచ్. అదీ- దెబ్బతిన్న పులిలా ఉన్న ఇంగ్లండ్ జట్టుతో. గెలవాల్సిన మ్యాచ్‌లను చేతులారా పోగొట్టుకున్న బ్లాక్ క్యాప్స్ సెమీ ఫైనల్ ముంగిట్లో పల్టీలు కొడుతోంది.

ఛేదించ దగ్గ స్కోరే అయినా..
ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా లండన్‌లోని లార్డ్స్ మైదానంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో న్యూజీలాండ్ జట్టు ఆస్ట్రేలియా చేతిలో 86 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. సెమీ ఫైనల్‌కు చేరే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇదివరకే సెమీస్ బెర్తును ఖరారు చేసుకున్న ఆస్ట్రేలియా టీమ్.. న్యూజీలాండ్‌ను ఓడించింది. ఛేదించడానికి అవకాశం ఉన్న స్కోరు ఉన్నప్పటికీ.. ఫాస్ట్ బౌలర్ మిఛెల్ స్టార్క్ ధాటికి ఎదురు నిలవలేకపోయింది న్యూజీలాండ్ క్రికెట్ టీమ్. 43.4 ఓవర్లలో 157 పరుగులకే కుప్పకూలింది. జట్టును ఒడ్డెక్కించే బాధ్యతను తన భుజాల మీద మరోసారి మోసే ప్రయత్నం చేశాడు కేప్టెన్ కేన్ విలియమ్సన్. సూపర్ ఫామ్‌లో ఉన్న విలియమ్సన్ ఈ మ్యాచ్‌లో కూడా టాప్ స్కోరర్‌గా నిలిచాడు గానీ.. మ్యాచ్‌ను గెలిపించలేకపోయాడు. 51 బంతుల్లో ఒక సిక్సర్, రెండు ఫోర్లతో 40 పరుగులు చేశాడు. స్టార్క్ బౌలింగ్‌లో కీపర్ అలెక్స్ కేరీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

టాప్ ఆర్డర్ టపటపా!
టాప్ ఆర్డర్‌లో రాస్ టేలర్ 30 పరుగులతో చెప్పుకోదగ్గ స్కోరు చేసినప్పటికీ.. అతనికి సహకారం అందించే వారే కరవయ్యారు. మిడిలార్డర్, లోయర్ మిడిలార్డర్.. వరుసగా వికెట్లను కోల్పోయింది. ఆస్ట్రేలియా స్పిన్, పేస్ బౌలింగ్ ముందు కనీసం ప్రతిఘటించలేక చేతులెత్తేశారు న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్లు. జట్టు స్కోరు 29 పరుగుల వద్ద ఓపెనర్ హెన్రీ నికోల్స్ వికెట్‌ను కోల్పోయిన తరువాత ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. కేన్ విలియమ్సన్-రాస్ టేలర్ మధ్య 55 పరుగుల భాగస్వామ్యమే అతి పెద్దది. ఆ తరువాత వచ్చిన బ్యాట్స్‌మెన్లందరూ తేలిపోయారు. పెవిలియన్‌కు క్యూ కట్టారు.

లార్డ్స్ లార్డ్.. స్టార్క్!
లార్డ్స్ గ్రౌండ్ లార్డ్‌లా మెరిశాడు ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మిఛెల్ స్టార్క్. నిప్పులు చెరిగే బంతులను సంధించిన అతను 26 పరుగులకు అయిదు వికెట్లను పడగొట్టాడు. లోయర్ ఆర్డర్‌లో వరుస వికెట్లను పడగొట్టి.. నడ్డి విరిచాడు. కోలుకోలేకుండా చేశాడు. కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్, మిఛెల్ శాంట్నర్, ఈష్ సోధి, ఫెర్గూసన్‌ల వికెట్లను పడగొట్టాడు. తోటి పేసర్ బెహ్రెన్‌డార్ఫ్ నుంచి చక్కటి సహకారం అందింది. బెహ్రెన్‌డార్ఫ్-2, పాట్ కమ్మిన్స్, స్టీవెన్ స్మిత్, నాథన్ లియాన్ ఒక్కో వికెట్ చొప్పున తీసుకున్నారు. పార్ట్ టైమ్ బౌలర్ స్మిత్ సైతం ఓ వికెట్ పడగొట్టాడు.

బౌల్ట్ హ్యాట్రిక్..
కివీస్ ఇన్నింగ్‌లో ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ హ్యాట్రిక్ తీసుకోవడం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. చివరి ఓవర్‌లో మూడు, నాలుగు, అయిదు బంతులకు అతను వరుసగా వికెట్లు తీసుకున్నాడు. న్యూజిలాండ్ తరఫున హ్యాట్రిక్ తీసుకున్న తొలి బౌలర్‌గా ఆవిర్భవించాడు. మూడో బంతికి ఖవాజా, నాలుగో బంతికి స్టార్క్‌లను క్లీన్ బౌల్డ్ చేశాడు. అయిదో బంతికి బెహ్రెన్‌డార్ఫ్‌ను ఎల్బీగా బలిగొన్నాడు. ఎల్బీపై ఆస్ట్రేలియా అప్పీల్‌కు వెళ్లినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. ఫలితంగా మొత్తం 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 243 పరుగులు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications